మార్కాపురం: బైకును కారు ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై మిట్టమీదిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. పెద్దారవీడు మండలం శివాపురం గ్రామానికి చెందిన పోతిరెడ్డి వెంకటేశ్వర్లు(30) తన బైక్‌పై కంభం వెళ్తున్నాడు. మహానంది నుంచి శ్రీశైలం వెళ్తున్న కారు తిప్పాయపాలెం–చింతకుంట్ల గ్రామాల మధ్య మిట్టమీదిపల్లి హైవే రోడ్డు దగ్గర బైకును ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే వెంకటేశ్వర్లు మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్కాపురం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఫారంపాండ్‌లో పడి యువకుడు మృతి
యర్రగొండపాలెం: నీళ్ల కోసం వెళ్లి ఫారం పాండ్‌లో జారిపడి యువకుడు మృతి చెందిన సంఘటన స్థానిక మార్కాపురం రోడ్‌లోని హైవే రెస్ట్ హౌస్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వీరభద్రాపురం గ్రామానికి చెందిన ఆలేటి అఖిల్(23) రెస్ట్ హౌస్ సమీపంలో భవన నిర్మాణ పనికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు నీళ్లు తీసుకురావడానికి సమీప పొలంలో ఉన్న ఫారం పాండ్ వద్దకు చేరుకున్నాడు.
నీరు పట్టుకునే క్రమంలో కాలుజారి పాండ్‌లో పడిపోయాడు. బయటకు రాలేక నీట మునిగి మృతి చెందాడని తోటి కార్మికులు చెప్పారు. అఖిల్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నత విద్య కోసం వేచి ఉన్నాడు. వేసవి సెలవులు కావడంతో కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా ఉండేందుకు బేల్దారి పనులకు వెళ్తున్నాడని అతని బంధువులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.చౌడయ్య తెలిపారు.


