బ్యాంకు లోన్ పేరుతో రూ.57 లక్షలకు టోకరా
ఒంగోలు టౌన్: బ్యాంకు లోన్ పేరుతో ఒక పరిశ్రమ యజమాని వద్ద రూ.57 లక్షలు కాజేశాడు ఓ కేటుగాడు. చేతిలో ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నాక కానీ తాను మోసపోయానని బాధితుడికి అర్థం కాలేదు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కర వేదికలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు. ఒంగోలుకు చెందిన ఒక పరిశ్రమ నిర్వాహకుడిని గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో సంప్రదించాడు. 50 శాతం సబ్సిడీపై బ్యాంకు లోన్ ఇప్పిస్తానని, అందుకుగాను క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరు మీద కొంత నగదును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని నమ్మించాడు. వెనకా ముందు ఆలోచించకుండా గుడ్డిగా బాధితుడు రూ.57 లక్షలు ఫిక్స్‌డ్ చేశాడు. ఆ తర్వాత క్రెడిట్ సొసైటీ గురించి వాకబు చేయగా అలాంటి సంస్థ ఏదీ లేదని తెలిసింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా సదరు వ్యక్తి బెదిరింపులకు దిగాడు. దీంతో ఎస్పీని కలిసి మోసపోయిన తీరును వివరించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఆన్‌లైన్ గేమ్ పేరుతో దగా
కనిగిరి పట్టణానికి చెందిన ఒక మహిళ వాట్సప్‌కు కొంత నగదు ఇన్వెస్ట్ చేసి టెలిగ్రామ్‌లో గేమ్ అడితే భారీగా డబ్బు గెలుచుకోవచ్చని ఆశ పెట్టారు. ఇదంతా నిజమని నమ్మిన సదరు మహిళ విడతల వారీగా 1.15 లక్షల రుపాయలను ఫోన్ పే చేశారు. అయినప్పటికీ సంతృప్తి చెందని మోసగాడు ఇంకా అదనంగా డబ్బు చెల్లించాలని మెసేజ్ పంపించడంతో మోసపోయినట్లు గుర్తించి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
● విజయవాడ రైల్వే స్టేషన్లో ఔట్‌సోర్సింగ్‌లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ విజయవాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు 25 వేల రుపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నారని, ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బు కూడా తిరిగివ్వడం లేదని సంతనూతలపాడుకు చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇలా జిల్లా నలుమూలల నుంచి పోలీస్ గ్రీవెన్స్‌కు మొత్తం 73 ఫిర్యాదులు అందాయి. బాధితుల సమస్యలు విన్న ఎస్పీ దామోదర్ ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడి చట్టపరంగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ సురేష్ బాబు, సీసీఎస్ సీఐ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, డీటీసీ సీఐ షమీవుల్లా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, నాగులుప్పలపాడు ఎస్సై షేక్ రజియా సుల్తానా, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ దామోదర్‌కు బాధితుడి ఫిర్యాదు పోలీస్ గ్రీవెన్స్‌కు 73 అర్జీలు


