సాగు పేరుతో భూమి.. చేస్తున్నదేమి?
సింగరాయకొండ:
సాగు చేసుకోవడానికి దేవదాయ శాఖ భూమిని వేలంలో దక్కించుకున్న వ్యక్తి ఒక్క పంట పండించలేదు. ఆ స్థలంలో దర్జాగా షాపులు నిర్మించడమే కాకుండా అద్దెకిచ్చి అదనంగా సొమ్ము చేసుకుంటున్నాడు. ఇంత జరుగుతున్నా దేవదాయ శాఖ అధికారులు చోద్యం చూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. పాత సింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి మూలగుంటపాడు పంచాయతీ సర్వే నంబర్ 44–1బీలో 0.84 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. జాతీయ రహదారిపై ఎయిర్ బేస్ పక్కనే ఉండటంతో ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో కోట్ల రూపాయలు పలుకుతోంది. గత ఏడాది దేవదాయ శాఖ అధికారులు నిర్వహించిన వేలంలో కలికవాయ గ్రామానికి చెందిన కూటమి సానుభూతిపరుడు ఈ భూమిని దక్కించుకున్నాడు. మూడేళ్ల పరిమితితో ఏడాదికి 2,500 రూపాయల చొప్పున కౌలు చెల్లించాలనేది నిబంధన. ఈ సంగతి పక్కనబెడితే.. కౌలుకు తీసుకున్న వ్యక్తి ఆ భూమిలో పంటలు పండించకుండా షాపులు ఏర్పాటు చేసి అద్దెకివ్వడం ప్రారంభించాడు. కరెంట్ మీటరు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు దరఖాస్తు చేయడంతో అసలు విషయం బట్టబయలైంది. దేవదాయ శాఖ భూమిలో ప్రస్తుతం ఒక ఫంక్చర్ షాపు, హోటల్ ఏర్పాటు చేసి భారీగా అద్దె వసూలు చేస్తున్న సదరు నాయకుడు.. మిగిలిన స్థలాన్ని సాగు చేయకుండా ఖాళీగా వదిలేశాడు. వాస్తవానికి సాగు కోసం తీసుకున్న భూమిలో ఎటువంటి కట్టడాలు నిర్మించకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే లీజును రద్దు చేసే హక్కు ఆలయ అధికారులకు ఉంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఆలయ అధికారులు సదరు వ్యక్తి వద్దకు వెళ్లి దుకాణాలు తొలగించాలని వేడుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేలం రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోకుండా బతిమాలడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై దేవస్థానం ఈఓ పి కృష్ణవేణిని వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించినప్పటికీ ఆమె స్పందించలేదు.
దేవదాయ శాఖ భూమిలో అక్రమ కట్టడాలు
పంక్చర్ షాపు, హోటల్ ఏర్పాటు చేసి
భారీ మొత్తంలో అద్దె వసూలు
కూటమి నాయకుడి నిర్వాకంపై నోరు మెదపని అధికారులు
విద్యుత్ కనెక్షన్ దరఖాస్తుతో విషయం
వెలుగులోకి.


