నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారో చెప్పాలి?
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదో చెప్పాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి. ప్రభాకర్ ప్రశ్నించారు. స్థానిక మల్లయ్య లింగం భవనంలో మంగళవారం ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తక్షణమే రాష్టంలోని నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం తిరుపతి వేదికగా వచ్చే నెల 15 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువజన సమాఖ్య జిల్లా నాయకులు మరియదాసు, రాజు, వంశీ, మార్కు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా నేతృత్వంలో రెవెన్యూ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. మార్కాపురంలో జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్‌తో పాటు అధికారుల బృందం సివిల్ సప్లయీస్ గోడౌన్‌ను పరిశీలించారు. ఒంగోలులో ఒంగోలు తహశీల్దార్ నేలభట్ల వాసు ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్‌ఐ శ్రీకంఠ శ్రీనివాస రావుతో కూడిన అధకారుల బృందం నగరంలోని గోడౌన్‌లను తనిఖీ చేశారు. నగరంలోని బాణసంచా గోడౌన్‌లతో పాటు ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఉన్న సివిల్ సప్లయీస్ గోడౌన్‌లో ఉన్న స్టాకును పరిశీలించారు. గ్యాస్ గోడౌన్లు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లలో తనిఖీలు చేశారు.


