పదిలో ఫెయిలైన వారికి ప్రత్యేక కార్యాచరణ
ఒంగోలు సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ విద్యార్థులకు ఈ నెల 28 నుంచి మే 18వ తేదీ వరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తరగతులు నిర్వహించాలని డీఈఓ ఎ.కిరణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులు వంద శాతం హాజరయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించినట్లు తెలిపారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుని ఆదేశాలను తప్పక పాటించాలన్నారు. ఉపవిద్యాశాఖాధికారులు, ప్రత్యేక తరగతుల నిర్వహణపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన సూచనలు తెలిపాలన్నారు. ఉదయం 8 నుంచి 9.15 గంటల వరకు సోషల్/భాషలు, ఉదయం గం.9.15 నుంచి గం.10.15 వరకు సైన్స్ (పీఎస్, బయోలాజికల్ సైన్స్), ఉదయం గం.10.15 నుంచి గం.10.30 గంటల వరకు విరామం, ఉదయం గం.10.30 నుంచి గం.12 వరకు గణితం.. ఈ ప్రకారం ఉత్తీర్ణులు కాని విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రధానోపాధ్యాయులు తరగతుల షెడ్యూల్‌ను మార్పు చేసుకోవాలని తెలిపారు.
ఉగ్రవాదుల దాడి..భారత లౌకికవాదంపై దాడే
ఒంగోలు టౌన్: కశ్మీర్‌లోని పహెల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడి ఏకంగా దేశ లౌకికకత్వంపై చేసిన దాడేనని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ మాజీ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు విమర్శించారు. స్థానిక మల్లయ్య లింగం భవనంలో సోమవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశంలో వారు మాట్లాడారు. పహెల్గామ్ దాడిని పిరికిపందల దాడిగా అభివర్ణించారు. కేవలం హిందువులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ముందే అనేక మంది హతమయ్యారని, వారి కుటుంబ సభ్యుల ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. మూడంచెల భద్రత కలిగిన జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారో సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మే 15 నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలో జరిగే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు యువతరం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎం.యుగంధర్, పరుచూరి రాజేంద్ర, జీ.సంతోష్ కుమార్, కత్తి రవి, నాగ రాముడు, ప్రభాకర్, సుభాని తదితరులు పాల్గొన్నారు.


