
కళాకారులను ప్రభుత్వాలు ఆదుకోవాలి
● ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు
ఒంగోలు మెట్రో: కళాకారులను ప్రభుత్వాలు ఆదుకోవాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూం ఆవరణలో శ్రీ నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అండ్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో కందుకూరి విశిష్ట పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ నటుడు మిడసల మల్లికార్జునరావుకు శనివారం అభినందన సభ నిర్వహించారు. కనమాల రాఘవులు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కళాకారులను ప్రభుత్వాలు గుర్తించి పురస్కారాలివ్వడం, అందులోనూ మిడసలకు పురస్కారం లభించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ నటుడు డాక్టర్ పరాంకుశం కేశవాచార్యులు మాట్లాడుతూ పౌరాణిక నాటకాలను ప్రజలు మెచ్చే విధంగా చేయడం, చేయించడంలో మిడసల అభినందనీయుడని కొనియాడారు. నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘ గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ, కళామిత్రమండలి (తెలుగు లోగిలి) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు, శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్‌బాబు, తదితరులు పాల్గొని మిడసలను ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సీవీఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ అధ్యక్షుడు ఈదుపల్లి గురునాథం, కార్యదర్శి కె.రాధాకృష్ణ, కోశాధికారి ఆరిగ వీరప్రతాప్, సింహాద్రి జ్యోతిర్మయి, యు.వి.రత్నం, కొప్పోలు వెంకటేశ్వర్లు, మెడబలిమి సాంబశివరావు, దామవరపు ముసలయ్య, కోవెలకుంట్ల బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా రాజేష్ దంపతులు పాడిన పాటలు, చందూ డ్యాన్స్ అకాడమీ చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.