డెయిరీ భూములను పరిశీలించిన జేసీ
ఒంగోలు సబర్బన్: ఒంగోలు డెయిరీ భూములను జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం భూములను అత్యవసరంగా సర్వే చేసి వాటి హద్దులను, హద్దురాళ్లను ఏర్పాటు చేయాలని రెవిన్యూ, సర్వే అధికారులను ఆదేశించామన్నారు. ఈ సందర్భంగా కొంతమంది తమకు పేర్నమిట్ట సర్వే నెంబర్ 140లో ఇంటి నివేశన స్థలాలను రిజిస్టర్ డాక్యుమెంట్లు ద్వారా కొనుగోలు చేశామని జాయింట్ కలెక్టర్‌కు దృష్టికి తీసుకొచ్చారు. డాక్యుమెంట్లను తీసుకొని పరిశీలించి తగు చర్యలను తీసుకోవాల్సిందిగా ఒంగోలు ఆర్‌డీఓను, సంతనూతలపాడు తహశీల్దార్‌ను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, సంతనూతలపాడు తహసీల్దార్, సర్వే, భూ రికార్డుల అధికారులు ఉన్నారు.
బస్టాండ్‌లో గడువు తీరిన కూల్‌డ్రింక్స్ విక్రయం
ఒంగోలు టౌన్: జిల్లా కేంద్రం ఒంగోలు ఆర్టీసీ డిపోలో గడువు తీరిన కూల్ డ్రింక్స్ విక్రయించడం మంగళవారం కలకలం సృష్టించింది. ఉప్పుగుండూరుకు చెందిన మహిళ రెండు రోజుల క్రితం శ్రీశైలం వెళ్లేందుకు ఒంగోలు ఆర్టీసీ డిపోకు వచ్చింది. బస్సు వచ్చిన హడావుడిలో డిపోలోని ఒక షాపులో కూల్ డ్రింక్ కొనుక్కొని వెళ్లి బస్సెక్కింది. బస్సులో డ్రింక్ తాగిన కొద్దిసేపటికి ఆమెకు కడుపులో తిప్పడం మొదలైంది. అనుమానం వచ్చి కూల్ డ్రింక్ బాటిల్ తీసి చూడగా దానిపై తేదీ మించి మూడు నెలల కావస్తోంది. ఇది గమనించిన ఆమె ఆందోళనకు గురైంది. తిరిగు ప్రయాణంలో ఆదివారం ఒంగోలులో బస్సు దిగింది. కూల్ డ్రింక్ షాపు యజమాని వద్దకు వెళ్లి అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకో..అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. డిపో అధికారులకు ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో చేసేదేమి లేక వెళ్లిపోయారు. ప్రతి బాటిల్‌పై 10 రుపాయలు అదనంగా తీసుకుంటూ కూడా ఇలా గడువుతీరిన కూల్ డ్రింకులను విక్రయించడం దుర్మార్గమని బాధిత మహిళ వాపోయారు. ఈ విషయం గురించి డిపో మేనేజర్ డి.శ్రీనివాసులును వివరణ అడిగితే షాపును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ప్రభాకర్ రావు దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుతానికి తాను చీరాలలో ఉన్నానని, ఒంగోలు వచ్చిన తర్వాత తనిఖీ చేసి చర్యలు తీసుకుంటానని తెలిపారు. గడువు తీరిన వస్తువులను విక్రయించిన దుకాణాదారుడిని కఠినంగా శిక్షించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
శిక్షణ హాజరు 75 శాతం ఉంటేనే కుట్టు మిషన్లు
ఒంగోలు వన్‌టౌన్: కుట్టు శిక్షణకు హాజరు 75 శాతం ఉంటేనే ఉచితంగా కుట్టు మిషన్లు మంజూరు చేస్తామని బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 5363 మందికి కుట్టుపై శిక్షణ ఇస్తామన్నారు. దీనిలో భాగంగా దర్శి మండలంలో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి 288 మందికి కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. దర్శి సచివాలయం 5 పరిధిలోని శివాజీనగర్‌లో, దర్శి సచివాలయం 2 పరిధిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలకు కుట్టు మిషన్‌లను ఉచితంగా అందించడమే కాకుండా భవిష్యత్తులో స్వయం శక్తితో ఎదిగేందుకు వీలుగా సబ్సిడీ రుణాలు కుడా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
డెయిరీ భూములను పరిశీలించిన జేసీ


