జగనన్నకే సాధ్యం
సంక్షేమ పథకాల అమలు
మార్కాపురం: ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం జగనన్నకే సాధ్యమని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ మంత్రి సురేష్ అన్నారు. లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి పట్టణంలోని అమ్మవారిశాల బజారులో వైఎస్సార్ సీపీ విద్యుత్ ప్రభపై ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే జగనన్నే సీఎం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి నెలా ఒక ఇంటికి వెళ్లి పరామర్శించి వారికి ఇల్లు మంజూరు చేస్తే ప్రజలందరికీ ఇళ్లు ఇచ్చినట్టేనా అని నాగేశ్వరరావు ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి మనసుతో కుల, మత, ప్రాంత, పార్టీలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ కళాశాలలు, పోర్టులు నిర్మిస్తే వాటిని ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ఏ సీఎం అయినా రాష్ట్రానికి మెడికల్ సీట్లు కావాలని కేంద్రాన్ని కోరతారని, మన రాష్ట్రానికి 750 మెడికల్ సీట్లు వస్తే చంద్రబాబు వెనక్కి పంపారన్నారు.
ప్రజలు కాదు..ఈవీఎంలే ఓడించాయి.
వైఎస్సార్ సీపీ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓడించలేదని, ఈవీఎంలే ఓడించాయని పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. కేవలం 10 నెలల కాలంలోనే ప్రభుత్వంపై ఎంతో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇంత రాత్రయినా కూడా ఇన్ని వేల మంది ప్రజలున్నారంటే వైఎస్సార్ సీపీపై ఎంతటి అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. నేను గెలిచినా.. ఓడినా మీ మధ్యనే ఉంటా.. మీ ఆత్మీయతను అభిమానాన్ని స్వీకరిస్తా. వచ్చే ఎన్నికల్లో జగనన్నను సీఎంగా గెలిపించుకుందామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ అమలు కావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎం చేసుకుందామన్నారు. మాజీ మంత్రి సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 10 నెలల పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కులం, మతం, ప్రాంతం చూడకుండా అభివృద్ధి పనులు చేస్తే కూటమి నేతలు మాత్రం వైఎస్సార్ సీపీ వారికి పనులు చేయమని చెప్పారన్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోట్ల విలువైన భూమిని 99 పైసలకు ప్రభుత్వం ఇస్తోందని, అదే క్వార్టర్ బాటిల్‌ను రూ.99లకు అమ్ముతోందన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తానని, మార్కాపురం జిల్లా చేస్తామని హామీఇచ్చి 10 నెలలు కావస్తున్నా ఇంత వరకూ అమలు కాలేదన్నారు. సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయనని, ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు మాట్లాడుతూ తాను గెలిచినా.. ఓడినా.. ప్రజల మధ్యనే ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, అన్నా కృష్ణచైతన్య, మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, ఏపీ మైనార్టీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్, పొల్యూషన్ బోర్డు మాజీ సభ్యుడు వెన్న హనుమారెడ్డి, మార్కాపురం, కొనకనమిట్ల, తర్లుపాడు జెడ్పీటీసీలు నారు బాపన్‌రెడ్డి, ఏడుకొండలు, ఇందిర, ఎంపీపీలు లక్ష్మీదేవి కృష్ణారెడ్డి, భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, మురళీకృష్ణ యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వైవీరావు, పీఎల్‌పి యాదవ్, కౌన్సిలర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.
అందరం సమష్టిగా మళ్లీ జగనన్ననుసీఎం చేసుకుందాం
10 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
ఒక్క హామీనైనా అమలు చేశారా..?
పార్టీ నేతలు కారుమూరి, చెవిరెడ్డి, బూచేపల్లి, జెడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ, అన్నా, సురేష్, చంద్రశేఖర్
జగనన్నకే సాధ్యం


