
ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఇద్దరు వీఆర్వోలు
చీమకుర్తి: దివ్యాంగుడైన ఓ రైతు పొలాన్ని ఆన్‌లైన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంలో ఇద్దరు వీఆర్వోలను ఏసీబీ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... చండ్రపాడు గ్రామానికి చెందిన కోటు శ్రీనివాసరావు, సోదరుడు అంకమ్మరావు, తల్లి రమణమ్మకు చెందిన భూమిని ఆన్‌లైన్ చేయమని దాదాపు రెండు నెలల నుంచి చండ్రపాడు సచివాలయం వద్ద వీఆర్వో వద్దకు తిరుగుతున్నారు. చండ్రపాడు సచివాలయంలో వీఆర్వో పోస్టు ఖాళీగా ఉండటంతో పల్లామల్లిలో వీఆర్‌ఓగా పనిచేస్తున్న వీఆర్వో మారెళ్ల వెంకట వీరనారాయణ ఇక్కడ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గ్రామానికి చెందిన దివ్యాంగుడు కోటు శ్రీనివాసరావు పొలం 2.27 ఎకరాలు, అంకమ్మరావు పొలం 2.10 ఎకరాలు, తల్లి రమణమ్మ పొలం 0.85 ఎకరాలను ఆన్‌లైన్ చేసేందుకు వీఆర్వో వెంకట వీరనారాయణ రూ.30 వేలు డిమాండ్ చేశాడు. రూ.10 వేలు ఇస్తానంటే కుదరదన్నాడు. సరేనని బేరం మాట్లాడుకొని రూ.20 వేలకు కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని పొలం యజమాని కోటు శ్రీనివాసరావు, ఆయన తల్లి రమణమ్మ కలిసి ఒంగోలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారిచ్చిన సూచనల మేరకు ఫిర్యాదుదారుడు కోటు శ్రీనివాసరావు వీఆర్వోకు ఫోన్ చేసి డబ్బులు తెచ్చాను ఎక్కడున్నారని అడిగారు. తాను పల్లామల్లి సచివాలయంలో ఉన్నానని, ఎల్లో కలర్ డ్రస్స్ వేసుకున్న ఒక మహిళ వస్తుందని, ఆమెకు రూ.20 వేలు ఇవ్వాలని వీఆర్వో వెంకట వీరనారాయణ ఫిర్యాదుదారుడికి ఫోన్‌లో చెప్పారు. చెప్పిన ప్రకారం ఎల్లో కలర్ డ్రెస్స్ వేసుకున్న మహిళ రెవెన్యూ కార్యాలయం వద్దకు వచ్చి బహిరంగంగానే ఫిర్యాదుదారుడు ఇచ్చిన రూ.20 వేలను తీసుకుంది. వెంటనే ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె కూడా చీమకుర్తి మున్సిపాలిటీలోని 4వ సచివాలయం వీఆర్వో సౌజన్యగా తెలిసింది. ఇద్దరు వీఆర్వోలు ఫోన్‌లో మాట్లాడుకున్న సమాచారాన్ని ఏసీబీ డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌లు ధ్రువీకరించుకున్నారు. ఇంతలో పోలీసులతో పల్లామల్లి సచివాలయం వద్దకు పంపించి వీఆర్వో వెంకట వీరనారాయణను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని శనివారం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు తెలిపారు.

వల్లూరి శ్రీనివాసరావు, ఏసీబీ డీఎస్‌పీ
Comments
Please login to add a commentAdd a comment