అభివృద్ధి లక్ష్యం..సంక్షేమ మార్గం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి లక్ష్యం..సంక్షేమ మార్గం

Sep 25 2023 1:48 AM | Updated on Sep 25 2023 1:48 AM

- - Sakshi

ఒంగోలు: జిల్లా పరిషత్‌ పాలకవర్గం బాధ్యతలు చేపట్టి సోమవారానికి రెండేళ్లు పూర్తి చేసుకుంది. 2021 సెప్టె ంబర్‌ 25న జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారంతోపాటు జెడ్పీ చైర్‌పర్సన్‌గా బూచేపల్లి వెంకాయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి జిల్లా పరిషత్‌ పరంగా జిల్లా అభివృద్ధికి పెద్ద పీటవేశారు. ఒక వైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమం, ఇంకో వైపు మానవీయ కోణాలను స్పృశిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటూ ముందుకు సాగుతున్న పాలకవర్గంపై జిల్లా ప్రజానీకం మరిన్ని ఆశలు పెంచుకున్నారు. గత రెండేళ్లలో జెడ్పీ పరంగా చేపట్టిన పలు కార్యక్రమాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. క్రమం తప్పకుండా పాలకవర్గ సమావేశాలు నిర్వహించడం, జిల్లా విభజన జరిగినప్పటికీ ఉమ్మడి ప్రకాశం జిల్లా వేదికగా జెడ్పీ సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం, ఎంపీపీ, జెడ్పీటీసీల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలకు పరిష్కారం చూపడంలో ప్రశంసలు అందుకుంది. మరో వైపు జెడ్పీటీసీ సభ్యులకు మండల కేంద్రాల్లో గౌరవం పెంపునకు ఒక గది తప్పనిసరి అని భావించి నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేసి జెడ్పీటీసీ సభ్యుల నుంచి అభినందనలు అందుకున్నారు. ప్రకాశం జిల్లా చరిత్రలోనే ప్రస్తుత జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, ఎంపీపీలు అందరూ కూడా వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన వారే కావడం గమనార్హం.

సీపీడబ్ల్యూ స్కీములకు రూ.57 కోట్లు

మంజూరు:

జిల్లాలో సమీకృత రక్షిత మంచినీటి పథకం (సీపీడబ్ల్యూఎస్‌)కు రూ.57 కోట్లు కేటాయించారు. 2022–23 సంవత్సరంలో జిల్లాలోని 55 సీపీడబ్ల్యూఎస్‌ స్కీముల నిర్వహణకు రూ.27.64 కోట్లు మంజూరు చేశారు. ఇక 2023–24 ఏడాదికి గాను రూ.29.36 కోట్లు మంజూరు చేశారు. రెండేళ్లలో ఈ పథకం నిర్వహణకు జెడ్పీ పాలకవర్గం రూ.57 కోట్లు మంజూరు చేసినట్లయింది.

జెడ్పీ సాధారణ నిధుల నుంచి

రూ.50 కోట్లు మంజూరు:

జిల్లాలో అపరిష్కృతంగా, అసంపూర్ణంగా ఉన్న పలు అభివృద్ధి పనులకు జెడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.50 కోట్లు కేటాయించారు. పనులు పూర్తయిన వాటికి ఇందులో ఇప్పటికే రూ.20 కోట్లకుపైగా చెల్లింపులు కూడా చేశారు. గ్రామ సచివాలయాలు నిర్మాణం, రైతు భరోసా కేంద్రాలు, విలేజి హెల్త్‌ క్లినిక్స్‌, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, తాగునీటి పంపిణీ, విద్య, వైద్యం, విద్యుత్‌, వ్యవసాయం, క్రీడలు, శ్మశానాల్లో రోడ్లు తదితరాలకు ఈ నిధులు వెచ్చించారు. 2021 సెప్టెంబర్‌ 25 మొదలు 2022 మార్చి 31 వరకు రూ.16.84 కోట్లు, 2022–23లో రూ.11.90 కోట్లు, 2023–24లో రూ.20.90 కోట్లు వెరసి రూ.49.64 కోట్లు కేటాయించారు. దర్శి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు ఏకంగా రూ.10 కోట్లు కేటాయించారు. వాటిని తాగునీటి పథకాలకు, సీసీ రోడ్లకు వెచ్చించారు.

సంక్షేమ హాస్టళ్లలో పెరిగిన ఉత్తీర్ణత శాతం:

దర్శి నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలల పదో తరగతి విద్యార్థులతోపాటు జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఉండి పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు జెడ్పీ నిధులు రూ.10 లక్షలు వెచ్చించి స్టడీ మెటీరియల్‌ అందించారు. దీని సాయంతో ఈ ఏడాది సంక్షేమ హాస్టళ్ల పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెరిగింది. దీంతో ఈ పథకాన్ని ఈ ఏడాది కూడా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. మరో వైపు బాలికల సంక్షేమ హాస్టళ్లను పరిశీలించినపుడు విద్యుత్‌ అంతరాయం కలిగితే బాలికలు పడుతున్న అవస్థలను ఆమె గమనించారు. దీంతో మానవీయ కోణంలో ఆలోచించి జెడ్పీ సొంత భవనాలు ఉన్న బాలికల సంక్షేమ వసతి గృహాలకు ప్రస్తుతం ఇన్వర్టర్లను ఏర్పాటుచేసి చిన్నారుల సంతోషానికి కారణమయ్యారు.

52 మందికి పదోన్నతులు..

మరో 72 మందికి కారుణ్య నియామకాలు:

ఈ రెండేళ్ల పదవీ కాలంలో 15 మంది రికార్డు అసిస్టెంట్లుగా, 9 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, 17 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 11 మంది సూపరింటెండెంట్లుగా వెరసి 52 మంది పదోన్నతులు అందుకున్నారు. పలువురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలకు తక్షణమే కారుణ్య నియామకాలు అందించి ఉపాధి కల్పించారు. 27 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, 15 మంది టైపిస్టులు, 30 మంది ఆఫీస్‌ సబార్డినేట్లుగా వెరసి 72 మంది ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నారు.

నేటితో మూడో వసంతంలోకి జిల్లా పరిషత్‌ పాలకవర్గం రెండేళ్లలో సీపీడబ్ల్యూఎస్‌ స్కీముల నిర్వహణకు రూ.57 కోట్లు మంజూరు గ్రామాల్లో అభివృద్ధి పనులకు జెడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.50 కోట్లు కేటాయింపు దర్శి నియోజకవర్గంలో రూ.10 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు రూ.10 లక్షలతో స్టడీ మెటీరియల్‌ బాలికల సంక్షేమ హాస్టళ్లకు జెడ్పీ నిధులతో ఇన్వర్టర్ల ఏర్పాటు

మరో పక్షం రోజుల్లో జెడ్పీ కార్యాలయం మార్పు

పరిపాలనా పరంగా ప్రస్తుతం ఉన్న జెడ్పీ కార్యాలయం చాలా ఇరుకుగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కార్యాలయం స్థానంలో నూతన కార్యాలయం నిర్మించాలని నిర్ణయించాం. ఈ మేరకు వివరాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కూడా పంపాం. ప్రస్తుతం ఫైల్‌ ఆర్థికశాఖ వద్ద ఉంది. నిధులు విడుదల కాగానే నూతన కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. అప్పటి వరకు జెడ్పీ కార్యాలయాన్ని మినీ స్టేడియం పక్కన ఉన్న డీపీఆర్‌సీ భవనంలోకి మార్చాలని నిర్ణయించాం. ఈ ప్రక్రియ మరో 10 నుంచి 15 రోజుల్లో పూర్తిచేస్తాం. జెడ్పీ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షలకు ఏమాత్రం భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో తనకు బాధ్యతల నిర్వహణలో సహకరిస్తున్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గౌరవ సభ్యులతోపాటు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మునుముందు కూడా ఇంతకంటే మంచిగా జిల్లా అభివృద్ధికి సహకరించాలని వారిని కోరుకుంటున్నా.

– బూచేపల్లి వెంకాయమ్మ, జెడ్పీచైర్‌పర్సన్‌

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement