మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి
● ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి వెల్లడి
మార్కాపురం: మార్కాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 23వ తేదీన ఇగ్నైట్ యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పోటీలకు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్, పాఠశాల హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి, కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పోటీలకు కలెక్టర్ దినేష్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సబ్ కలెక్టర్ సేథు మాధవన్‌తోపాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. జిల్లాలో ఉన్న వివిధ పాఠశాలల నుంచి 1000 మంది విద్యార్థినీ విద్యార్థులు రావచ్చని, ఇప్పటికే 800 మందికి పైగా తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. 23వ తేదీ ఉదయం 8 గంటలకల్లా అందరూ పాఠశాలకు రావాలని, 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. క్విజ్, ఫోక్‌డ్యాన్స్, వ్యాసరచన విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లోని సృజనాత్మకతను, ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన వసతితోపాటు బహుమతి ప్రదానం చేస్తారని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సుమారు 100 మంది ఉపాధ్యాయులతో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే వెంట ఉపాధ్యాయులు మండ్లా రామాంజనేయులు, ప్రభాకర్‌రెడ్డి, ఓవి వీరారెడ్డి, తర్లుపాడు మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.


