చోరీ కేసులో ముగ్గురు అరెస్టు

కనిగిరి రూరల్: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కుని పరారైన కేసులో ముగ్గురిని పోలీసులు శుక్రవారం పట్టుకుని, వారి నుంచి బంగారు గొలుసు, బైక్ రికవరీ చేశారు. ఈ మేరకు డీఎస్పీ రత్నాకర రామరాజు స్థానిక కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. హెచ్‌ఎంపాడు మండలం వీరారెడ్డిపల్లికి చెందిన ఉడుముల ఆదిలక్ష్మమ్మ 70 ఏళ్ల వృద్ధురాలు. గత నెల 25న ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా.. దొంగలు ఆమె మెడలోని సుమారు 18 గ్రాముల బంగారు గొలుసును లాకుని పరారయ్యారు. బాధితురాలు గత నెల 27న హెచ్‌ఎంపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. డీఎస్పీ రామరాజు ఆధ్వర్యంలో కనిగిరి సీఐ శివరామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో కనిగిరి, హెచ్‌ఎంపాడు, పీసీపల్లి ఎస్సైలు దాసరి ప్రసాద్, కృష్ణపావని, నాగేశ్వరావు, పోలీసు సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం సాంకేతిక పరిజ్ఞానంతో వేములపాడు గ్రామంలోని గుడిపాటిపల్లి గ్రామానికి వెళ్లే అడ్డరోడ్డు ప్రాంతంలో పొదిలి మండలానికి చెందిన పొన్నరసు అంజయ్య అలియాస్ చిన్న పోలా, పొన్నరసు పోలా నరేష్, పొన్నరసు యేసుదాసు అలియాస్ యేసు పోలాను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు. నిందితుల నుంచి 18 గ్రాముల చైన్, చోరీకి ఉపయోగించిన బైక్(హోండా షైన్), రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసులను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
నిందుతులపై గతంలోనే కేసులు
గొలుసు దొంగతనం కేసులో పట్టుబడిని ముగ్గురు నిందితులు బంధువులు. వీరు పలు నేరాలకు పాల్పడినట్లు రికార్డులున్నాయి. ఏ1, ఏ3లపై పొదిలి స్టేషన్‌లో కూడా పలు కేసులు నమోదై ఉన్నాయి. వీరు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోరీలను పాల్పడినట్లు సమాచారం. నిందితులు తెలివిగా ఆధార్ కార్డుల్లో ఇంటి పేర్లు మార్చి పలు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి వీళ్ల ఇంటి పేర్లు పోలా( పాముల కులం) కాగా పొన్నర్సు(ఎరుకుల కులం)గా ఆధార్‌లో నమోదు చేసుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే అవకాశం ఉన్నచోటల్లా నేరాలకు తెగబడుతున్నారని డీఎస్పీ తెలిపారు.
నిందితులు పాత నేరస్తులు..
బంగారు గొలుసు, బైక్ రికవరీ
ఆధార్‌లో ఇంటి పేరు మార్చేసిన వైనం
కనిగిరి సీఐ, కనిగిరి, హెచ్‌ఎంపాడు, పీసీపల్లి ఎస్సైలను అభినందించిన డీఎస్పీ