నిర్మాణానికి రూ.5 కోట్లు

పృథులగిరి ఘాట్
మర్రిపూడి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పృథులగిరి లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మించేందుకు రూ.5 కోట్లు మంజూరు చేస్తూ సీఎం పేషీ నుంచి మంగళవారం పరిపాలన అనుమతులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ వింగ్ సమన్వయకర్త, మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి చేసిన ప్రయత్నం ఫలించింది. భక్తుల ఇలవేల్పుగా మారిన 15వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఏటా ఫాల్గుణ శుద్ద పౌర్ణమినాడు బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లిస్తుంటారు. ఈ ఆలయానికి 140 ఎకరాల భూమి ఉంది. అయితే పృథులగిరిపైకి చేరుకోవాలంటే భక్తులకు మెట్లమార్గమే దిక్కు. గత బ్రహ్మోత్సవాల సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో భక్తులు దారి ఏర్పాటు చేసుకున్నారు. ఈ రహదారికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే అటవీ శాఖాధికారులు 6 మీటర్ల వెడల్పు, రెండున్నర కిలోమీటర్లు పొడవున ఘాట్ రోడ్ గుండా కొండపైకి వెళ్లేందుకు అనుమతులు ఇచ్చారు. లక్ష్మీనృసింహస్వామి ఆలయం వద్దకు భక్తులు చేరుకునేందుకు తారు రోడ్ నిర్మించాలని, అందుకు రూ.5 కోట్లు అవసరమవుతాయంటూ వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు, ఎంపీపీల సంఘం జిల్లా అధ్యక్షుడు, మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 12న మార్కాపురం పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. ఈ మేరకు ఘాట్‌రోడ్ నిర్మాణానికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎంఓ నుంచి ఒంగోలు పీఆర్ ఎస్‌ఈకి ఉత్వర్వులు అందాయి. దీనిపై ఆయన సర్వే చేసి అంచనాలు ఇవ్వాలని ఒంగోలు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను ఆదేశించారు. ఘాట్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేసిన వరికూటి అశోక్‌బాబు, ఎంపీపీ వాకా వెంకటరెడ్డిని మండల ప్రజలతోపాటు భక్తులు అభినందించారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరగడమే కాకుండా, పృథులగిరి ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరికూటి, వాకా కృషితో గుండ్లసముద్రం, మర్రిపూడి చెరువులకు సాగర్ జలాలు అందించే పనులకు అనుమతి మంజూరు కాగా సంబంధిత అధికారులు సర్వే నిర్వహించిన విషయం విధితమే. తాజాగా ఘాట్‌రోడ్‌కు అనుమతులు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం పేషీ నుంచి అనుమతులు మంజూరు
ఫలించిన వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి వరికూటి, ఎంపీపీ వాకా ప్రయత్నం