
కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్
ఒంగోలు అర్బన్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో జూన్ 5వ తేదీ వాలంటీర్ ఎన్విరాన్‌మెంటల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన పర్యావరణ హిత నడక కరపత్రాన్ని కలెక్టర్ దినేష్‌కుమార్ శనివారం ప్రకాశం భవనంలో ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న గ్రీన్ వాక్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. ఆర్గనైజేషన్ చైర్మన్ వీరభద్రాచారి మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం రోజు సీవీఎన్ రీడింగ్ రూము నుంచి కలెక్టరేట్ వరకు గ్రీన్‌వాక్ నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో ట్రైనీ ఐఏఎస్ పాల్గొన్నారు.
కోటప్పకొండ ఇన్చార్జ్ ఈఓగా శ్రీనివాసరెడ్డి
మార్కాపురం: పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం ఇన్చార్జ్ కార్యనిర్వహణాధికారిగా మార్కాపురం లక్ష్మీచెన్నకేశవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి గొలమారి శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. కోటప్పకొండ ఆలయాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, త్వరలో బాధ్యతలు స్వీకరిస్తానని శ్రీనివాసరెడ్డి చెప్పారు.