విద్యార్థులకు అండగా ప్రభుత్వం

ఒంగోలు అర్బన్: విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు ఇచ్చేలా అన్నీ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని జాయింట్ కలెక్టర్ కే శ్రీనివాసులు అన్నారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. దీనికి అనుబంధంగా ప్రకాశం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌తో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒడా చైర్‌పర్సన్ శింగరాజు మీనా వెంకట్రావు పాల్గొన్నారు. దీనిలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 37,415 మంది విద్యార్థులకు చెందిన 33,794 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.34.71 కోట్లను జమ చేసినట్లు వివరించారు. పేదరికంతో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ విద్యార్థులను ఆర్థికంగా ఇంత పెద్ద స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం అభినందనీయమన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రారంభించి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు బాటలు వేశారని గుర్తు చేశారు. ఒడా చైర్‌పర్సన్ సింగరాజు మీనా వెంకట్రావ్ మాట్లాడుతూ విద్యా దీవెన పథకం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కలుగుతోందన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి బాటలు వేస్తున్నారని అభినందించారు. దీనిలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారి అర్చన, బీసీ సంక్షేమ అధికారి అంజల పాల్గొన్నారు.
విద్యార్థుల తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన నగదు జిల్లాలో 37,415 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.34.71 కోట్లు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు