టిడ్కో ఇళ్లతో సెల్ఫీ ఆటలా? ఇదేం రాజకీయం.? ఇదేం దుర్మార్గం? | Sakshi
Sakshi News home page

టిడ్కో ఇళ్లతో సెల్ఫీ ఆటలా? ఇదేం రాజకీయం.? ఇదేం దుర్మార్గం?

Published Wed, Apr 26 2023 1:02 AM

చింతల వద్ద ప్రస్తుతం వేగంగా జరుగుతున్న టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు - Sakshi

పట్టణ, నగరాల్లో పేదలకు పక్కా గృహాల నిర్మాణాల్లో గత టీడీపీ ప్రభుత్వం మాయాజాలం చేసింది. పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపడుతోందని చంద్రబాబు ఆర్భాటపు ప్రకటనలు . సాధారణ ఎన్నికలు వచ్చే వరకూ కాలక్షేపం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పట్టణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిడ్కో) ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నామని నటిస్తూ వచ్చింది.

సార్వత్రిక ఎన్నికలు సమీపించే సమయంలో హడావుడిగా తూతూ మంత్రంగా పనులు చేపట్టి గాలికొదిలేసి. కేంద్రం తన వాటాగా ఇచ్చిన నిధులతో మాత్రమే పనులు చేపట్టి చేతులు దులుపుకుంది. వాటిని చక్కటి మౌలిక వసతులతో పూర్తి చేసి పేదలకు అందించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూనుకుంది. టిడ్కో ఇళ్లపై వాస్తవం ఇదీ..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9,568 టిడ్కో గృహాలకు నిర్మించేందుకు రూ.482 కోట్లు ప్రాజెక్టు వ్యయం అవుతుందని టీడీపీ ప్రభుత్వ హయాంలో అంచనాలు రూపొందించింది. ఒంగోలు నగరంతోపాటు కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, అద్దంకి, కనిగిరి మున్సిపాలిటీల్లో టిడ్కో ఇళ్లు నిర్మించాలని భావించింది. ఒంగోలు నగరంలో చింతల, కొప్పోలుల్లో కలిపి 4,128 గృహాలు నిర్మించాలని స్థలాల ఎంపిక కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మార్కాపురంలోని పెద్దనాగులాపురం రోడ్డులో 912 మందికి, గిద్దలూరు మోడెంపల్లిలో 1248 మందికి, కనిగిరి చాకిరాలలో 912 మందికి, అద్దంకి శింగరకొండలో 960 మందికి, కందుకూరు ఉప్పుచెరువు వద్ద 1408 మందికి టిడ్కో గృహాలు నిర్మించి ఇవ్వాలని ఏర్పాట్లు చేశారు.

30 శాతం కూడా నిర్మాణం పూర్తి చేయని టీడీపీ ప్రభుత్వం:

జిల్లాలోని టిడ్కో గృహాల నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వం కనీసం 30 శాతం కూడా పూర్తి చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో పునాదులు లేపి వదిలేశారు. కొన్నింటిలో మాత్రం స్లాబులు మాత్రమే వేశారు. మొత్తం రూ.482 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అందులో కేవలం రూ.145.32 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. అదికూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఇచ్చిన మొత్తాన్ని ఖర్చుచేసి తాము టిడ్కో గృహాలను దాదాపు పూర్తి చేశామని డప్పు కొట్టుకుంది.

6,112 గృహాలు ఉచితంగా ఇస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం:

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో 300 చదరపు గజాల టిడ్కో ఇంటిని ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్ల కోసం నగదు చెల్లించిన లబ్ధిదారులు దాదాపు 6,112 మంది ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను నిర్మించేందుకు పూనుకుంది. ఇందుకు సంబంధించి రూ.350 కోట్లు కేటాయించింది. రివర్స్‌ టెండర్ల ద్వారా పనులు చేపట్టింది. ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసింది. మొదటి విడతగా 2,640 గృహాలకు రివర్స్‌ టెండర్‌లో 11 శాతం లెస్‌కు టెండర్లు కోట్‌ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.23.34 కోట్లు మిగిలింది. వీటి నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. మిగతా గృహాలకు ఫేజ్‌–2, ఫేజ్‌–3 కింద పనులు చేపట్టేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు.

రూ.12.72 కోట్లు పసుపు, కుంకుమకు:

టిడ్కో గృహాల్లో లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.12.72 కోట్లను చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల సమయంలో పసుపు–కుంకుమకు ఖర్చు చేశారు. ఆ నిధులను టిడ్కో గృహాల కోసం వెచ్చించాల్సి ఉంటే వాటిని కూడా పసుపు–కుంకుమకు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూశాడు. ఇళ్లపేరుతో నాడు పేద ప్రజలను మోసం చేసిన టీడీపీ నేతలు నేడు సెల్ఫీల పేరుతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను ప్రజలు ఈసడించుకుంటున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పట్టించుకోకుండా కాలక్షేపం చేసి నేడు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సెల్ఫీ చాలెంజ్‌ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు.

సిగ్గులేకుండా దామచర్ల సెల్ఫీనా....

"ఒంగోలు నగరంలో ఇళ్లు నిర్మిస్తామని 15,500 మంది వద్ద నుంచి టీడీపీ నేతలు డబ్బులు కట్టించుకున్నారు. కేవలం 4 వేల ఇళ్లు మాత్రమే ప్రారంభించారు. ప్రజల నుంచి కట్టించుకున్న డబ్బును ఏం చేశారో తెలియదు. కానీ టీడీపీకి చెందిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సోమవారం టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లి సిగ్గులేకుండా సెల్ఫీ వీడియో దిగటం సరికాదు.  అప్పట్లో ప్రజల వద్ద వసూలు చేసిన సొమ్మును ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తిరిగి ప్రజలకు అందజేస్తోంది. తగుదనమ్మా అంటూ దామచర్ల సెల్ఫీ వీడియో దిగి ప్రజలకు ఏమని సంకేతాలు ఇద్దామనుకుంటున్నాడో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒంగోలు నగరంలోని చింతలలో రూ.98 కోట్లు ఖర్చుచేసి 1392 ఇళ్లు టీడీపీ హయాంలో పూర్తి చేశామని టీడీపీ వాళ్లు చెబుతున్నారు. అది పూర్తిగా అబద్ధం. ఆ ప్రాజెక్టు మొత్తం వ్యయ అంచనాలు రూపొందించిందే రూ.81.80 కోట్లు. అందులో రూ.45.18 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. ఇంకా 55.23 శాతం పనులు జరగాల్సి ఉంది. ఇకపోతే కొప్పోలు ప్రాజెక్టులో 4656 గృహాలకు నిర్మాణ పనులు చేపట్టి రూ.450 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అన్నీ అబద్దాలే చెబుతూ ఇప్పటికీ ప్రజలను మోసం చేస్తున్నారు."

– బాలినేని శ్రీనివాస రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే

1/1

Advertisement
Advertisement