సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైఎస్సార్‌సీపీకి చెందిన దళిత కార్యకర్త మంద సాల్మన్ దారుణ హత్యపై రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం సమర్పించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు తమకు సోమవారం (19వ తేదీ)నాడు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.
ఊరు విడిచి ఎక్కడో తలదాచుకుంటూ, తన భార్యను చూసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్‌ను పిన్నెల్లిలో దారుణంగా ఐరన్ రాడ్లతో కొట్టి హత్య చేశారని.. రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతిభద్రతలకు ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోందని లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దళితులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోతోందని, ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్తలు ప్రాణ భయంతో బిక్కుబిక్కు మంటున్నారని ఆయన తెలిపారు. సాల్మన్ హత్య కేసులో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, బాధ్యులకు తగిన శిక్ష పడేలా చూడాలని డీజీపీని కోరనున్నట్లు లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.


