‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా

YSRCP wins in local by elections: Andhra Pradesh - Sakshi

మచిలీపట్నం మేయర్‌ పదవి గెలుచుకున్న అధికార పార్టీ

నందిగామ వైస్‌ చైర్మన్‌ పదవి కూడా వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే 

లింగాల, పెద్దపప్పూరు ఎంపీపీలుగా అధికార పార్టీ వారే

మూడు మండలాల్లో ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ అదే ఫలితం

సాక్షి, అమరావతి: ఎన్నికలు ఏవైనా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నగర కార్పొరేషన్‌ మేయర్‌ స్థానంతో పాటు నందిగామ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్, రెండు ఎంపీపీ, మూడు వైస్‌ ఎంపీపీ స్థానాలకు సోమవా­రం జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. మచిలీపట్నం నగర కార్పొరేషన్‌ మేయర్‌గా వైఎస్సార్‌సీపీకి చెందిన 43వ వార్డు మెంబర్‌ సీహెచ్‌ వెంకటేశ్వరమ్మ ఎన్నికయ్యారు. నందిగామ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ తరుఫున గెలిచిన ఒకటో వార్డు మెంబర్‌ పాకాలపాటి కృష్ణ ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వెల్లడించింది.

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం, లింగాల ఎంపీపీగా అలవాలపాటి రమాదేవి (వైఎస్సార్‌­సీపీ), తాడిపత్రి నియోజకవర్గం, పెద్దపప్పూరు మండలాధ్యక్షుడిగా జి.వెంకటరామిరెడ్డి (వైఎస్సార్‌­సీపీ), అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజక­వర్గం గాలివీడు మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా గాలి శ్రీనివాసులు (వైఎస్సార్‌సీపీ), రాప్తాడు నియో­జకవర్గం, చెన్నేకొత్తపల్లి మండల పరిషత్‌ ఉపాధ్యక్షులుగా పి.జ్యోతి (వైఎస్సార్‌సీపీ), అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్‌.రాయవరం మండల ఉపాధ్యక్షుడిగా బొలిశెట్టి గోవిందరావు (వైఎస్సార్‌సీపీ)లు ఎన్నికైనట్టు అధికారులు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా నలజర్ల మండలంలో పార్టీ రహితంగా జరిగిన కోఆప్షన్‌ సభ్యుని ఎన్నికలో సయ్యద్‌ మునాఫ్‌ గెలిచినట్లు అధికారులు వెల్లడించారు. 

170 గ్రామాల్లో ఉప సర్పంచి ఎన్నిక పూర్తి.. 
రాష్ట్ర వ్యాప్తంగా 186 గ్రామాల్లో ఉప సర్పంచి పదవులకుగాను సోమవారం 170 గ్రామాల్లో ఎన్నిక పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం అధికారులు పేర్కొన్నారు. 11 గ్రామాల్లో ఎన్నికలు వాయిదా పడగా.. మరో చోట స్థానిక వార్డు మెంబర్‌ చనిపోయిన కారణంగాను, ఇంకో నాలుగు గ్రామ పంచాయతీల్లో కోరం లేక తాత్కాలికంగా ఉప సర్పంచ్‌ ఎన్నిక వాయిపడినట్టు అధికారులు వివరించారు. వాయిదా పడిన 11 గ్రామాల్లో మంగళవారం మరో విడత ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top