సాక్షి, తిరుపతి: ‘సర్’ ప్రభావంతోనే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రంలో సీఎంలుగా ఉన్న మమత బెనర్జీ, స్టాలిన్‌లు ఓడిపోయారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని.. బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమన్న రోజా.. సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
‘‘రాష్ట్రంలో జగనన్న పాలన దూరం చేసుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అందడం లేదు. రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. 30 లక్షలు తల్లులకు అమ్మఒడి దూరం చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ రంగాకు టీ ఇచ్చాను.. గద్దర్‌కు కారు కొనిచ్చా అని చెప్పుకుంటున్నాడు.
..మంత్రి నారా లోకేష్ లీకేజీ స్టార్ అయ్యారు. వైఎస్సార్‌సీపీ నేతలను జైల్లో పెట్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు తుడవటానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు కనీసం పట్టించుకోలేదు’’ అని ఆర్కే రోజా ధ్వజమెత్తారు.


