
కృష్ణాజిల్లా: కూటమి నేతలకు నచ్చితే సెక్షన్‌లు ఉండవు. నచ్చకపోతే సెక్షన్‌లు అమాంతం అమల్లోకి వస్తాయి. ఇప్పుడే ఇది జరిగింది. నిన్న(గురువారం, అక్టోబర్ 9వ తేదీ) వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన క్రమంలో ‘ఛలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమం చేపట్టినందుకు మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు మేకల సుబన్నను అరెస్టు చేశారు. మొత్తం 400 మందిపై అక్రమ కేసులు బనాయించారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున కేసులు పెట్టామని పోలీసులు అంటున్నారు.. అధికార పార్టీ ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ నేతలపై వేధింపులకు దిగారు.
దీనిపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. సుబ్బన్న అక్రమ అరెస్ట్ పై మచిలీపట్నం పోలీసులను నిలదీశారు పేర్ని నాని. 365 రోజులూ సెక్షన్ 30 పెడితే ప్రజల గొంతు వినిపించకూడదా? అంటూ ప్రశ్నించారు. ‘ఛలో మెడికల్ కాలేజ్ నిరసన చేపట్టినందుకు అక్రమ కేసులు పెట్టారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందుకు కేసులు పెట్టామంటున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రమంతా సెక్షన్ 30 అమలు చేయడం వింతగా ఉంది. ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వ వ్యతిరేక విధానల పై నిరసన చేపట్టడం మా బాధ్యత.

365 రోజులూ సెక్షన్ 30 పెడితే ప్రజల గొంతు వినిపించకూడదా?, ఛలో మెడికల్ కాలేజీ నిరసన చేపట్టినందుకు 400 మంది పై కేసు పెట్టారు. నోటీసులు ఇచ్చిన వారమంతా స్టేషన్ కు వెళ్లి మా వివరాలిచ్చాం. మేకల సుబ్బన్నను మాట్లాడాలని స్టేషన్‌కు పిలిపించి అరెస్ట్ చేశామని చెప్పారు. ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోవడం లేదు. కొల్లు రవీంద్రకు అనుకూలంగా పనిచేస్తే తమను ఏమీ చేయలేరనే భావనలో పోలీసులు ఉన్నారు. మా పట్టణ అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే మేం ప్రశ్నించకూడదా?, అరెస్ట్ నోటీసులు ఇవ్వమంటే పోలీసులు ఇవ్వడం లేదు. కోర్టులు ఎన్ని సార్లు చెప్పినా పోలీసులకు చాలా చులకన భావం కనిపిస్తోంది.
మేం వేసిన రిమాండ్ ను రిజెక్ట్ చేసే ధైర్యం కోర్టులకు ఉందా అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేసి 10 రోజులు లోపలేశాం మర్చిపోయారా అంటున్నారు. మేకల సుబ్బన్న స్టేషన్‌కు వచ్చాడో లేదో సిసి కెమెరా రికార్డులు తీయండి. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మెప్పు కోసం అధికారులు పనిచేస్తున్నారు. తప్పుడు కేసులు,తప్పుడు అరెస్టుల పై పోరాడతాం. ఎంత మంది పై కేసులు పెట్టారో లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం మీదేనని రౌడీలను పోలీసులు బ్రతిమిలాడుతున్నారు . మా పార్టీ వాట్సాప్ గ్రూపులను పోలీసులు హ్యాక్ చేశారు. మీ జగన్ మళ్లీ సీఎం అయితే ఏం చేస్తాడని పోలీసులు మాట్లాడుతున్నారు’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు.
