సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర బడ్జెట్‌లో ఏ వర్గానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడలేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరిగినా గత ప్రభుత్వం అంటూ ఆరోపణలు చేయడమే పాలకులకు సరిపోతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి సర్కార్‌దేనని కామెంట్స్ చేశారు.
తాడేపల్లిలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ఏ వర్గానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడలేదు. వైఎస్ జగన్ హయాంలో నవరత్నాలు పేరుతో ప్రజలకు అండగా నిలబడ్డాము. ఏపీ ప్రజలని మోసం చేసిన ఘనత కూటమి సర్కార్‌ది. రైతులకు అండగా ఉంటామని చెప్పి మోసం చేశారు. మోసాలతో గద్దెనెక్కటమే చంద్రబాబు పాలసీ. సుప్రీంకోర్టులో రద్దు చేసిన జీవో నెంబర్-3ని మళ్ళీ తీసుకొస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. కానీ ఇంతవరకు దానిపై ఎలాంటి చర్యలు లేవు. సుప్రీంకోర్టులో జీవో నెంబర్-3 కోసం వైఎస్సార్‌సీపీ రివ్యూకు వెళ్ళింది. జీవో రద్దు అయ్యాకే డీఎస్సీ నియామకాలు చేయాలి. అప్పుడే గిరిజన యువతకు మేలు జరుగుతుందన్నారు.
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ..‘ఏజెన్సీలోని యువత కోసం 275 జీవో ఉండేది. కానీ, ఎన్టీఆర్ హయంలో జీవో నెంబర్-3ని అమలు చేశారు. సుప్రీంకోర్టు జీవో నెంబర్-3ని రద్దు చేయటంపై వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో జీవో-3ని రద్దు చేసి 100శాతం ఉద్యోగాలు ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు దాన్ని పట్టించుకోవడం లేదు. అలాగే, ఆదివాసీల ప్రాంతాలు నిర్వీర్యం అవుతున్నాయి. ఆదివాసీల భూములను కూడా కబ్జా చేస్తున్నారు. కూటమి సర్కార్ పాలనలో భూకబ్జాలు పెరిగాయి. ఆదివాసీల భూములను కాపాడాలి.. లేదంటే ఉద్యమిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.
ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి మాట్లాడుతూ..‘2015లో చంద్రబాబు హయాంలోనే యురేనియం తవ్వకాలపై జీవో ఇచ్చారు. యురేనియం అంశాలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలి. కూటమి ప్రభుత్వంలో తవ్వకాలు జరిగాయా? లేక వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగాయో ప్రజలే చెబుతారు. ప్రజల దగ్గరకు వచ్చి చర్చించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా?. రాష్ట్రంలో ఏం జరిగినా గత ప్రభుత్వమే కారణమని ఆరోపణలు చేయటమే పాలకులకు సరిపోయింది. చంద్రబాబు వచ్చి ఎన్ని రోజులైందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రతీ చోటా పోలీసులను కాపలా పెట్టారు. యురేనియం తవ్వకాలు జరిగితే అక్కడ గాలి పీల్చినా సమస్యే అవుతుంది. సహజవాయువులన్నీ కలుషితం అవుతాయి. ప్రజలపై ప్రేమ ఉంటే యురేనియం తవ్వకాల జీవోను రద్దు చేయండి. సహజవాయువుపై ప్రభావం చూపించే యురేనియం తవ్వకాలను మేము ప్రోత్సాహించడం లేదు. యురేనియం తవ్వకాల ప్రభావం నాలుగు నియోజకవర్గాలపై ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment