స్థానిక ఎన్నికలు.. ఈసీకి వైఎస్సార్‌సీపీ 3 కీలక లేఖలు | YSRCP Letters To The Election Commission | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలు.. ఈసీకి వైఎస్సార్‌సీపీ 3 కీలక లేఖలు

Oct 9 2026 5:17 PM | Updated on Oct 9 2026 5:32 PM

YSRCP Letters To The Election Commission

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అభ్యర్ధులకు తగినంత భద్రత ఇవ్వాలని, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా కేంద్రాల్లో సమర్పించేందుకు అవకాశం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. అలాగే వీటి కాపీల్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) మోహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.

కేంద్ర సాయుధ పోలీసు బలగాలను తగిన సంఖ్యలో మోహరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర బలగాల మోహరింపు ఎన్నికల సంఘం సమర్థవంతమైన పర్యవేక్షణలో జరగాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై రాజకీయ బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల భద్రత బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర పోలీసులకు అప్పగిస్తే నిష్పక్షపాత వాతావరణం ఉంటుందన్న నమ్మకం తమకు లేదన్నారు. కూటమి పాలనలో ప్రతిపక్ష అభ్యర్థులు బెదిరింపులు, దాడులు, రాజకీయ ప్రేరేపిత పోలీసు చర్యలు, రాజకీయ కార్యకలాపాలకు అడ్డంకులు ఎదుర్కొంటున్నారని లేఖలో వెల్లడించారు.

ఈ పరిస్థితులు ఎన్నికల సమయంలో మరింత తీవ్రమై, ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడం, ప్రచారాన్ని నిరోధించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క పోలింగ్ రోజు మాత్రమే భద్రత కల్పించడం సరిపోదని, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే కేంద్ర బలగాలను మోహరించి, ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు ప్రకటించే వరకు కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, ప్రతిపాదకులు, మద్దతుదారులపై ఒత్తిళ్లు తీసుకురావడం ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని లేళ్ల అప్పిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామాలు, వార్డుల వంటి సన్నిహిత సమాజాల్లో బెదిరింపులు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతిపక్ష అభ్యర్థులు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లు తమ చట్టబద్ధమైన ఎన్నికల బాధ్యతలను నిర్వహించకుండా పోలీసు అధికారాలను ఉపయోగించకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎన్నికల్లో ఎవరు పాల్గొనాలి, ఓటర్లు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశాలను అధికార పార్టీ ప్రభావం లేదా ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం నిర్ణయించకూడదని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి దృశ్యాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి కోరారు.

సున్నితమైన ప్రాంతాల్లో స్వతంత్ర పరిశీలకులు, మొబైల్ పర్యవేక్షణ బృందాలను నియమించాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు వివక్ష లేకుండా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, అధికార యంత్రాంగాన్ని లేదా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.

అలాగే  మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా కేంద్రాల్లో సమర్పించేందుకు అవకాశం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అభ్యర్థులు భయం, బెదిరింపులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యామ్నాయ సదుపాయం కల్పించాలని కోరారు. నామినేషన్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, రసీదుల జారీ, సంబంధిత అధికారులకు పత్రాల బదిలీ ప్రక్రియలో స్పష్టమైన విధానాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement