
పల్నాడు జిల్లా: గురజాల సబ్ జైల్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఉప్పుతల హరికృష్ణను ములాఖత్ ద్వారా ఆ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, డాక్టర్ చింతలపూడి అశోక్, కె.వి.మురళీధర్ రెడ్డి. పరామర్శించారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత ఉప్పుతల యల్లయ్య కుమారుడు హరికృష్ణని దాచేపల్లి సీఐ పి.భాస్కరరావు దారుణంగా కొట్టి అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరచడం, గురజాల సబ్‌జైల్‌కు రిమాండ్‌కు పంపిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు గురజాల సబ్ జైల్‌లో హరికృష్ణను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయమే వైఎస్ జగన్ ఫోన్ చేసి హరికృష్ణ విషయం మాట్లాడారు. మేం గురజాల వచ్చి సబ్‌జైల్‌లో ఉన్న హరికృష్ణను, చల్లా ప్రేమ్‌కుమార్ ఇద్దరినీ పరామర్శించాం. హరికృష్ణను కొట్టిన విషయంలో కొన్ని విషయాలు మీడియా ముందు చెప్పాలంటే సిగ్గుగా ఉంది. పోలీసులు దారుణంగా చిత్రహింసలు పెట్టారు. చెప్పుకోలేని చోట అతి క్రూరంగా హింసించారు. ఉదయం 4 గంటలకు పోలీసులు టీడీపీ నాయకుడు జానీ బాషా కారులో తంగెడ వెళ్ళి పోలీస్ స్టేషన్‌కు రమ్మని బలవంతంగా దాచేపల్లి తీసుకొచ్చి సీఐ భాస్కర్ దారుణంగా కొట్టాడు.
పోలీసులు కేసులు పెట్టాలి కానీ ఇంత దారుణంగా హింసిస్తారా.. గతంలో పాలేటి క్రిష్ణవేణిని ఇలాగే ఇబ్బందులు పెట్టాడు. తంగెడ నుంచి హరికృష్ణ తెలంగాణ వెళ్లిపోయి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, కానీ పండుగ రోజని ఇక్కడికి వస్తే ఇలా దారుణంగా హింసించి చివరికి జైలుకు పంపారు. హరికృష్ణకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలి. మేం ఉన్నత న్యాయ స్థానానికి వెళ్ళి న్యాయం జరిగేలా చూస్తాం. సీఐ పొన్నూరు భాస్కర్ ఇంత దారుణంగా వ్యవహరిస్తాడా.. అతనికి ఇది కొత్తకాదని తెలిసింది.
ఖాకీ బట్టలు వేసుకుంటే రౌడీలా ప్రవర్తిస్తావా. భాస్కర్ ముందు నీపై 307 కేసు పెట్టాలి, నీపై కూడా ప్రైవేట్ కేసు వేస్తాం. పోలీస్ శాఖ తక్షణమే ఆయన్ను సస్పెండ్ చేయాలి, డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకోకపోతే మేం చట్టపరంగా ఏం చేయాలో అది చేస్తాం. తేలుకుట్లకు చెందిన చల్లా ప్రేమ్‌కుమార్ పక్క రాష్ట్రంలో ఉంటే సారా అమ్ముతున్నాడని అక్రమ కేసుపెట్టి జైల్లో వేశారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదు. పోలీసుల్లో భాస్కర్ లాంటి తలబిరుసు సీఐలకు చెబుతున్నాం. చిలకలూరిపేటలో సుబ్బనాయుడు ఇలాగే వ్యవహరిస్తున్నాడు, మేం అధికారంలోకి రాగానే మీ సంగతి చూస్తాం, ఇలాంటి కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే సుప్రింకోర్టుకు వెళతాం.

నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. మా పార్టీ కార్యకర్త హరికృష్ణను దాచేపల్లి సీఐ భాస్కరరావు క్రూరంగా హింసించాడు, ఒక పశువులాగా సీఐ వ్యవహరించాడు, సిగ్గుతో తలదించుకోవాలి, మీరు తప్పులు చేస్తే కేసులు పెట్టి కోర్టులో హాజరుపరచాలి అంతేకానీ ఇదంతా ఎందుకు చేశారు, సీఐ భాస్కరరావును తక్షణమే సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, జనం తిరగబడే సమయం వచ్చింది, పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి, హరికృష్ణ విషయంలో హైకోర్టుకు కూడా వెళతాం. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులు వేధిస్తున్నారు, పైగా కేసులు మాఫీ కావాలంటే లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు. మా నాయకుడు వైయస్ జగన్ గారి సూచనల మేరకే మేమంతా ఇక్కడికి వచ్చాం, పోలీస్ వ్యవస్ధకే సీఐ భాస్కర్ మచ్చలాంటి వాడు.
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ప్రజలను చిత్రహింసలు పెట్టడం ఎక్కడా చూడలేదు, సీఐ భాస్కర్, హరికృష్ణను బూటు కాళ్ళతో తొక్కుతూ పైశాచిక ఆనందం పొందాడు. సీఐ భాస్కర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఏపీలో రెడ్ బుక్ పాలనను పక్కనపెట్టకపోతే పోరాటం తప్పదు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడరు, మేం చట్టపరంగా కేసులు ఎదుర్కుంటాం
సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోంది, హరికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, గతంలో పాలేటి క్రిష్ణవేణిని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు, పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సీఐను సస్పెండ్ చేయాలి, సీఐ భాస్కర్‌కు ఇది కొత్త కాదు, కాబట్టి ఆయనపై వెంటనే చర్య తీసుకోవాలి. వైఎస్సార్‌సీపీ వారెవరూ భయపడాల్సిన అవసరం లేదు, మీకు పార్టీ అండగా ఉంటుంది, మనమంతా కలిసి పోరాడుదాం
హరికృష్ణ తండ్రి ఉప్పుతల యల్లయ్య మాట్లాడుతూ.. మా అబ్బాయిని, నన్ను పోలీసులు బలవంతంగా దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు, సీఐ రాగానే నన్ను మా అబ్బాయిని పోలీసులు పట్టుకున్నారు, నా కుమారుడిని నా ముందే పోలీసులు చిత్రహింసలు పెట్టారు, కాళ్ళ మీద ఇద్దరు కూర్చుంటే సీఐ, ఇద్దరు పోలీసులు తీవ్రంగా కొట్టారు, నేను దండం పెట్టి బతిమిలాడినా వదలకుండా కొట్టారు. నేను తట్టుకోలేక పోయాను, అంత దారుణంగా కొట్టారు.
హరికృష్ణ భార్య భార్గవి మాట్లాడుతూ.. నా భర్తను పోలీసులు యూనిఫామ్ లేకుండా వచ్చి బలవంతంగా తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టారు, నా భర్తకు ఏమైనా జరిగితే మా కుటుంబం అంతా రోడ్డునపడుతుంది, ఏ తప్పు చేయని నా భర్తని ఇంత దారుణంగా చిత్రహింసలు పెట్టే అధికారం పోలీసులకు ఎక్కడిది. నాకు ముగ్గురు పిల్లలు, నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను.