సాక్షి, అమరావతి: డీజీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. సాల్మన్ హత్యపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఆఫీసుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు.. ఆయన అపాయింట్‌మెంట్‌ను కోరారు. అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు డీజీపీ గుప్తా నిరాకరించారు. డీజీపీ కార్యాలయం స్పందించకపోవడంతో గేటు ముందు వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో నిరసనకు తలొగ్గి అనుమతినిచ్చారు. ఏడీజీ ఫిర్యాదు తీసుకున్నారు.
అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీ కార్యాలయంలో కనీసం మనుషులుగా కూడా గౌరవించలేదని.. పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తిపై కేసులు పెట్టడం దారుణమని.. కూటమి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ‘‘సాల్మన్‌ను హత్య చేసిన నిందితులపై ఇప్పటివరకు కేసులు పెట్టలేదు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దారుణాలు, అఘాయితాలు పెరిగాయి. సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే బాధిత కుటుంబానికి ప్రభుత్వం కోటి పరిహారం ఇవ్వాలి’’ అని మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన దళిత కార్యకర్త మందా సాల్మన్ దారుణ హత్యపై డీజీపీకి వినతిపత్రం అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు తమకు సోమవారం అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ డీజీపీకి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు.
ఊరు విడిచి ఎక్కడో తలదాచుకుంటూ, తన భార్యను చూసేందుకు వచ్చిన మందా సాల్మన్‌ను పిన్నెల్లిలో దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేశారని, రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతిభద్రతలకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని అప్పిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దళితులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్తలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.


