
టీడీపీ అరాచకాలపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టండి
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
రాష్ట్ర అధికార యంత్రాంగానికి హైకోర్టు ఆదేశం
నిష్పాక్షికంగా నిర్వహణకు చర్యలు తీసుకోవాలని చెప్పాం.. అదనపు బలగాలను కూడా మోహరించాలని స్పష్టం చేశాం
వైఎస్సార్‌సీపీ వినతిపత్రాన్ని ఇప్పటికే డీజీపీకి పంపాం
హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
అధికార పార్టీ కండబలం, ధనబలంతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తోంది
ఇంత జరుగుతున్నా.. పోలీసులు చోద్యం చూస్తున్నారు
ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి
ఈ విషయంలో మేం ఇచ్చిన వినతిపై ఎన్నికల సంఘం స్పందించడం లేదు.. మా విజ్ఞప్తిపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి
హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ (స్థానిక) ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ వ్యవహారంలో ఇంతకుమించి జోక్యం చేసుకోలేమని పేర్కొంది.
స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలంటూ వైఎస్సార్‌సీపీ సమర్పించిన వినతిపత్రాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యల నిమిత్తం డీజీపీకి పంపిందని గుర్తుచేసింది. ఈ వ్యాజ్యంలో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంతటితో పరిష్కరిస్తున్నట్లు తెలిపింది.
⇒ స్థానిక ఎన్నికల ప్రక్రియలో సీసీ టీవీల ఏర్పాటు, వెబ్ క్యాస్టింగ్, స్వతంత్ర పరిశీలకులు, అభ్యర్థులకు పోలీసు రక్షణ, ఎన్నికల ప్రక్రియను వీడియో తీసే విషయంలో అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేవారందరికీ సమాన అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేశారు.
దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవట్లే..
పిటిషనర్ తరఫు న్యాయవాది వడ్లమూడి కిరణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ... స్థానిక ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతిని వివరించారు. అధికార పార్టీ కండబలం, ధనబలంతో ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతోందని, అయినా పోలీసులు చోద్యం చూస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా జరిగే పరిస్థితుల్లేవని పేర్కొన్నారు.
పారదర్శకంగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. దీనిపై కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్ సమర్పించిన వినతిపై స్పందించామని తెలిపారు. వారు కోరిన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఎన్నికల కమిషన్ సూచించిందన్నారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించాలని కూడా చెప్పిందన్నారు.
ప్రశాంత ఎన్నికల బాధ్యత అధికారులదే!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్
శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని పులివెందుల డీఎస్పీ, పులివెందుల గ్రామీణ సీఐ, పట్టణ సీఐలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి చర్యల నిమిత్తం ఎన్నికల అధికారి (కలెక్టర్), జిల్లా ఎస్పీకి పంపిన విషయాన్ని రికార్డు చేసింది. తమ ముందు దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదులకు సెల్ ఏర్పాటు చేయాలి
ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా తటస్థంగా వ్యవహరించేలా పులివెందుల పోలీసులను ఆదేశించాలని... ఎన్నికల కమిషన్ ఆమోదం లేకుండా ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్టు చేయొద్దని ఆదేశాలివ్వాలంటూ పులివెందుల మండలం తుమ్మలపల్లికి చెందిన తుమ్మల హనుమంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఎన్నికల నిర్వహణకు తటస్థ అధికారులను వినియోగించేలా ఆదేశాలివ్వడంతో పాటు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులకు విభాగం (సెల్) ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఎన్నికల కమిషన్‌కూ వినతిపత్రాలు ఇచ్చామని, ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. వీటిపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ విచారణ జరిపారు.
ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు వివేక్ చంద్రశేఖర్, సి.విశ్వనాథ్‌లు వాదనలు వినిపిస్తూ పిటిషనర్ వినతిపత్రాలను జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపామని.. ఆ మేరకు ప్రొసీడింగ్స్ కూడా జారీ అయ్యాయని తెలిపారు. ఈ వివరాలను రికార్డ్ చేసిన న్యాయమూర్తి, ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు.