సాక్షి, అమరావతి: డీజీపీ కార్యాలయంలో కనీసం మనుషులుగా కూడా గౌరవించలేదని.. పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. దళిత కార్యకర్త సాల్మన్ హత్యపై ఫిర్యాదు చేయడానికి వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లగా.. డీజీపీ కార్యాలయం స్పందించలేదు. దీంతో ఆ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. చివరికి ఫిర్యాదును ఏడీజీ తీసుకున్నారు.
డీజీపి ఆఫీసుకు వచ్చిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు ఉన్నారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వ్యక్తిపై కేసులు పెట్టడం దారుణమని.. కూటమి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ‘‘సాల్మన్‌ను హత్య చేసిన నిందితులపై ఇప్పటివరకు కేసులు పెట్టలేదు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దారుణాలు, అఘాయితాలు పెరిగాయి. సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం కోటి పరిహారం ఇవ్వాలి’’ అని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.
‘‘పిన్నెల్లి గ్రామం పోలీసుల జాగీరా?. అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు చూపించాలట..!. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడలేనివారు రాష్ట్రాన్ని ఏం కాపాడతారు?. సాల్మన్‌ను హత్య చేసిన వారికి శిక్ష పడేవరుకు పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే యరపతినేనికి దళితులు అంటే చులకన. ఒక మనిషి ప్రాణం విలువ ఎమ్మెల్యే యరపతినేనికి తెలియడం లేదు. సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు.
మందా సాల్మన్‌ది ప్రభుత్వం చేసిన హత్యే: మేరుగ నాగార్జున
మందా సాల్మన్ ది ప్రభుత్వం చేసిన హత్యే. సీబిఐతో విచారణ జరపాలి. హత్య గురించి ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైగా సాల్మన్ మీదే కేసు నమోదు చేశారు, సాల్మన్ మృతదేహాన్ని చూడటానికి కూడా మాకు అవకాశం కల్పించలేదు. వైఎస్ జగనే స్వయంగా వస్తానన్నారు. సాల్మాన్ మృతదేహాన్ని ఖననం చేస్తానని చెప్పటంతో పోలీసులు స్పందించారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది?.
..దీనిపై ఫిర్యాదు ఇవ్వటానికి వస్తే డీజీపి ఆఫీసులో అనుమతి లేదన్నారు. మేము ధర్నా చేస్తేగానీ డీజీపి కార్యాలయం స్పందించలేదు. ఏడీజీ మా ఫిర్యాదు తీసుకున్నారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే కేసులు కూడా నమోదు చేయటం లేదు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవటం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది
డీజీపీ అసలే మాత్రం స్పందించలేదు: అంబటి రాంబాబు
సాల్మన్ హత్య కేసులో పోలీసుల వైఖరి వివాదాస్పదంగా ఉంది. సాల్మన్‌పైనే పోలీసులు కేసు పెట్టారు. డీజీపి ఆఫీసుకు వస్తే కనీసం సమాధానం లేదు. డీజీపీ అసలే మాత్రం స్పందించలేదు. అందుకే డీజీపి ఆఫీసు బయట ధర్నా చేశాం. ఇప్పటికి 10, 15 సార్లు వచ్చినా ఫిర్యాదు తీసుకోలేదు. డీజీపి వైఖరి దారుణంగా ఉంది. సాల్మన్ హత్యపై ఉన్నతస్థాయి విచారణ చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి
హైకోర్టులో పిల్ వేస్తాం: కాసు మహేష్ రెడ్డి
ఏపీలో దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం నడుస్తోంది. దళిత నాయకుడు సాల్మన్ హత్య జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. దాడి చేసిన వారిమీద కాకుండా చనిపోయిన వ్యక్తి మీదే కేసు పెట్టారు. మత సంప్రదాయం ప్రకారం కూడా సాల్మన్ మృతదేహానికి ఖననం చేయనీయకుండా చేశారు. శ్మశానానికి వెళ్లేటప్పుడు కూడా ఆధార్ కార్డు తీసుకు రావాలన్న దిక్కు మాలిన ప్రభుత్వం ఇది. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయబోతే ఆయన నిరాకరించారు. బాధితుల గోడు వినే స్థితిలో కూడా పోలీసు అధికారులు లేరు. దీనిపై హైకోర్టులో పిల్ వేస్తాం. దళిత కార్యకర్త సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం
అవమానించారు: టీజేఆర్ సుధాకర్ బాబు
డీజీపీ ఆఫీసుకు వెళ్తే తమను అవమానించారు. డీజీపీ చంద్రబాబుకు ఏజెంట్‌గా పని చేస్తున్నారా?. రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తున్నారా?. రాష్ట్రంలో దళితులను ఊచకోత కోస్తున్నారు. మాకు ఈ రాష్ట్రంలో బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. అయినా సరే మా పోరాటం ఆగదు. సాల్మన్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. యరపతినేని శ్రీనివాసరావు పై చర్యలు తీసుకోవాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రక్షణ లేదు: విడదల రజిని
పోలీసు అధికారులు తమ విధులను కూడా మర్చిపోయారు. ప్రజలను గాలికి వదిలేసి చంద్రబాబు, లోకేష్‌కి సేవలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రక్షణ లేదు. టీడీపీ గూండాలు ఇళ్ల మీదకి వచ్చి హత్యలు చేస్తున్నారు. ఈ 20 నెలలుగా ఎంతో మంది హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో ఏ సామాన్యుడు కూడా పోలీసు స్టేషను కు వెళ్లే పరిస్థితి లేదు. లోకల్ టీడీపీ ఎమ్మెల్యే చెప్తేనే స్టేషన్‌లోకి అడుగు పెట్టనిస్తున్నారు. డీజీపీ ఆఫీసులోకే మమ్మల్ని రానివ్వని పోలీసులు ఇక సామాన్యులకు ఏం న్యాయం చేస్తారు?. పోలీసులే దగ్గరుండి హత్యలు చేయిస్తున్నారు
ఆటవిక పాలనకు చెక్ పెడతాం: మొండితోక అరుణ్ కుమార్
ఒక దళితుడిని హత మార్చితే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?. నేనే పెద్ద మాదిగనని ఎన్నికల సమయంలో చెప్పే చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారు?. ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలు సాల్మన్ హత్యపై ఎందుకు మౌనం వహించారు?. దళితులే చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే టైం వచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పాలనకు చెక్ పెడతాం


