
తాడేపల్లి : అమరావతిలో ఐదు ఎకరాల్లో భారీ భవంతిని నిర్మిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తెరలు కట్టుకుని ఎందుకు శంకుస్థాపన చేసుకున్నట్లో చెప్పాలని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నిలదీశారు. వందల కోట్లతో చంద్రబాబు ప్యాలస్ కట్టుకుంటూ, దానికి శంకుస్థాపన చేసే క్రమంలో విషయం బయటకు రాకూడదని తెరలు కట్టుకుని మరీ చేసుకున్నారని టీజేఆర్ విమర్శించారు.
అమరావతిలో ప్యాలెస్ కట్టుకుంటున్నారు..
తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ తాడేపల్లిలో వైఎస్ జగన్ రెండు ఎకరాల్లో పార్టీ ఆఫీసు, ఇల్లు కట్టుకుంటే విష ప్రచారం చేశారు. వాటిపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేశారు. ఇప్పుడు వందల కోట్ల రూపాయలతో చంద్రబాబు అమరావతిలో ప్యాలెస్ కట్టుకుంటున్నారు. ఐదు ఎకరాల్లో ఈ భారీ ప్యాలెస్ నిర్మాణం చేస్తున్నారు. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్, కొండాపూర్ లలో చంద్రబాబు కట్టుకున్న ఇళ్లు, ఫామ్ హౌస్ ల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది.
ఇంట్లో వాడిన విదేశీ మొక్కల దగ్గర్నుంచీ ఇంటరీయర్ లకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఏ ఒక్కరినీ ఆ ఇంట్లోకి కూడా రానివ్వరు. అమరావతిలో చంద్రబాబు ఇంటి శంకుస్థాపనకు మంత్రులకు కూడా ఆహ్వానం లేదు. స్థానిక దళిత ఎమ్మెల్యేకు కూడా ఆహ్వానం లేదు. ఇంటి శంకుస్థాపనకు కూడా చంద్రబాబు తెరలు కట్టుకుని ఎందుకు శంకుస్థాపన చేశారో చెప్పాలి. అమరావతిలో గజం రూ.60 వేలు ఉందని గతంలో చంద్రబాబు చెప్పారు. కానీ చంద్రబాబు ఇంటికి మాత్రం గజం రూ.7,500కే ఎలా కొన్నారు?,
కాంట్రాక్టర్ల కమీషన్లతోనే..
జూబ్లిహిల్స్‌లోని ఇంటి నిర్మాణం పూర్తిగా కాంట్రాక్టర్ల కమీషన్లతో నిర్మించారు. టిడ్కో ఇళ్ల కాంట్రాక్టర్ ద్వారా మంగళగిరిలో టీడీపీ ఆఫీసు నిర్మాణం చేశారు. హైటెక్ సిటీ నిర్మాణ కాంట్రాక్టర్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నిర్మాణం చేశారు. చంద్రబాబు ఇళ్లన్నీ రాజప్రసాదాలే. అందుకే ఆ అంతఃపురాల్లోకి ఎవరికీ ప్రవేశం లేదు. రాష్ట్ర ఖజానాని చంద్రబాబు దోచుకుంటున్నారు
జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చారు. చంద్రబాబు, లోకేష్ లు మాత్రం సిండికేట్ లకు భారీగా కాంట్రాక్టులు కట్టబెడుతూ వేల కోట్లు కమీషన్లు కొల్లగొడుతున్నారు. రాజధానిలో పొలాలు ఇచ్చిన రైతులకు ఎక్కడో స్థలాలు ఇచ్చి, చంద్రబాబు మాత్రం ప్రధాన ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ అమరావతి అంతఃపురానికి పెడుతున్న ఖర్చు ఎంతో చెప్పాలి.
జగన్ ఇంట్లోకి మీడియా, సినిమా నటులు, పారిశ్రామిక వేత్తలు సైతం వెళ్లారు. మరి చంద్రబాబు అంతఃపురాల్లోకి ఎవరినీ ఎందుకు రానివ్వటం లేదు?’ అని ప్రశ్నించారు టీజేఆర్.