
తాడేపల్లి : లేని మద్యం కేసుని సృష్టించి సిట్ అధికారులు వేధింపులకు దిగారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. ఆ కేసులో ఇప్పటివరకూ సిట్ ఒక్క ఆధారాన్ని కూడా సేకరించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈరోజు(శనివారం, జూలై 26) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్ సుధాకర్ బాబు.. ‘ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు రాబోతున్న సమయంలో మళ్ళీ సోదాలు అంటూ డ్రామా చేస్తోంది.
అరెస్టు సమయంలో 8 గంటల పాటు సోదాలు, విచారణ చేసిన సిట్ అధికారులు మళ్ళీ సోదాలు చేయటమంటే ఇది కుట్ర కాక మరేంటి?, బాలాజీ గోవిందప్ప అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్‌కు డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ ని అక్రమ కేసులో ఇరికించారు. ఇలాగైతే రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు ఎలా వస్తారు?, గౌరవ కుటుంబం నుండి వచ్చిన బాలాజీ గోవిందప్పని వేధించటం ద్వారా ఏం సాధించదలచుకున్నారు?, పోలీసు వ్యవస్థని పూర్తిగా తన సొంతం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
బాలాజీ గోవిందప్పని ఇప్పటికే 75 రోజుల నుండి జైల్లో పెట్టారు. పారిశ్రామిక వేత్తలపై దాడులు చేయటం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ కొనసాగాలన్నా బెదిరించి కప్పం వసూలు చేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు పరిశ్రమలను ఎలా బెదిరిస్తున్నారో అందరికీ తెలుసు. వీరి దెబ్బకు తట్టుకోలేక పరిశ్రమలు పరారవుతున్నాయి. దీనిపై చర్చకు మేము సిద్దం, మీరు సిద్దమా?, నియోజకవర్గంలో నుండి గ్రానైట్ వాహనాలు వెళ్తుంటే వాటిని ఆపి కమీషన్లు లాక్కుంటున్నారు. మద్యం కేసులో సిట్ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపలేదు. జగన్ అత్యంత పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశారు’ అని స్పష్టం చేశారు.
