రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా..?
● తానేటి వనిత మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో విషయంలో టీడీపీ అబద్ధాలు బయటపడ్డాయని, అసత్యాలు మాట్లాడి తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చగొట్టే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారన్నారు. అసత్యాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీను తొలగించమంటే భౌతిక దాడులకు దిగటం సిగ్గుచేటన్నారు. అంబటి రాంబాబు కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
● టీడీపీ అక్రమాల అడుగులకు మడుగులు వత్తుతున్న ప్రతి ఒక్కరూ చట్టం ముందు దోషులుగా నిలబటం తథ్యమన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ పరిపాలన కోసం ప్రజల ఎదురు చూస్తున్నారని చెప్పారు. కచ్చితంగా రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వం, అధికారులు చట్టబద్ధంగా మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
● మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం పచ్చి అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. టీడీపీ తప్పులను ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు.
● గుంటూరులో వక్ఫ్ ఆస్తులకు అండగా పోరాటం చేస్తున్న నాయకుడు అంబటి రాంబాబు అని తెలిపారు. కేవలం అంబటి ఒక మాట తూలినంత మాత్రాన జరిగిన విధ్వంసం కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్న ఆయనపై దాడికి పాల్పడ్డారన్నారు. దాడులను ఆయన ఖండించారు.
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందని హోంశాఖ మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ నాయకులు దాడి చేయటంతో పాటు, ఆయనపై అక్రమ కేసులు బనాయించిన విషయం విదితమే. ఈ క్రమంలో సోమవారం సిద్ధార్థర్‌లోని అంబటి నివాసానికి వచ్చి వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ముందుగా దాడి జరిగిన కార్యాలయం, ఇంటిని పరిశీలించారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, అంబటి రాంబాబు కుమార్తె మౌనిక, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హోంశాఖ మాజీ మంత్రి తానేటి వనిత