నగరి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ మహిళా నేత ఆర్‌కే రోజా మరోసారి ధ్వజమెత్తారు. భూముల రీసర్వే అంశానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదేమిటో అంటూ నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వేనే ఇప్పుడు మీరు చేయడం లేదా అని ప్రశ్నించారు. ఆనాడు తమపై విషం చిమ్మి.. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు కదా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు(శనివారం, జనవరి 24వ తేదీ) చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి మాట్లాడిన ఆర్‌కే రోజా.. చంద్రబాబు పాలనంతా ఎగనామాలు, కోతలే అంటూ విమర్శించారు.
‘పాస్‌బుక్‌లపై మీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నారు. మీ పాలనంతా ఎగనామాలు.. కోతలుగానే ఉంది. 51 లక్షల మంది మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎగనామం పెట్టారు. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. సిగ్గులేకుండా సూపర్-సూపర్‌హిట్ అని ప్రచారం చేసుకోవడం నిజంగా సిగ్గుచేటు’ అని మండిపడ్డారు.


