సాక్షి, పల్నాడు జిల్లా: పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు పథకం ప్రకారమే హత్య చేశారని వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అండతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పిన్నెల్లి గ్రామంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని.. గ్రామానికి చెందిన వందలాది కుటుంబాలు భయంతో బయటికి వెళ్లిపోయాయని కాసు మహేష్‌రెడ్డి అన్నారు.
‘‘సాల్మన్ కూడా భద్రత లేక గ్రామాన్ని వదిలి బయట జీవనం సాగిస్తున్నాడు. భార్య అనారోగ్యంతో ఉండటంతో ఆమెతో మాట్లాడేందుకు సాల్మన్ పిన్నెల్లి గ్రామానికి వెళ్లాడు. అతను గ్రామానికి వచ్చిన వెంటనే తెలుగుదేశం నాయకులు అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సాల్మన్ మూడు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బదులు, కోమాలో ఉన్న సాల్మన్‌పైనే కేసులు పెట్టడం ఎంత దారుణం? సాల్మన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించినా సీఐ పనికిమాలిన సెక్షన్లు మాత్రమే పెట్టారు.
..రేపు పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అంత్యక్రియలు జరుగుతాయి. చంద్రబాబు, లోకేష్ నీతులు చెప్పడం కాదు. పిన్నెల్లి గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయిన 1500 మంది పరిస్థితిపై సమాధానం చెప్పాలి. ఈ హత్యకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలి’’ అని కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు.


