
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో వెన్నుపోటు రాజకీయానికి తెర తీసిందన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రంలో ఏడు లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఎగొట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచి 20 వేలకు మాత్రమే పరిమితం చేసిందని విమర్శలు చేశారు.
మాజీ మంత్రి కారుమూరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అన్నదాత సుఖీభవలో కూటమి మరో మోసం చేస్తోంది. 26వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి.. ఎన్నికలైన 14 నెలల తర్వాత ప్రజలను మోసం చేసే కార్యక్రమం ప్రారంభించారు. 10,716 కోట్లు గత ఏడాది రైతులకు ఎగొట్టారు. ఏడు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వడం లేదు. దర్శిలో సినిమా సెట్టింగ్ వేసి మంచాలకు కూడా పచ్చ రంగు వేసి ఈ కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం మరో వెన్నుపోటు రాజకీయానికి తెర తీసింది.
రైతులను నట్టేట ముంచి 20వేలకు మాత్రమే పరిమితం చేసింది. ఐదేళ్లలో వైఎస్ జగన్ రైతులకు 67,500 అందించారు. తల్లికి వందనం కోతలు లేకుండా ఇస్తామని చెప్పి 13వేలు ఇచ్చారు. అందులో కూడా లక్షలాది మందికి పంగనామం పెట్టారు. రైతు గురించి పూర్తిగా ఆలోచించడం మానేశారు. రైతులను పూర్తిగా గాలికి వదిలేశారు. 5,500 రూపాయలకు కోకో పంట టన్నుకు ఇప్పిస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు రైతులను దారుణంగా మోసం చేశారు. మామిడికాయ కిలోకు 19 రూపాయలు ఇస్తామని చెప్పి రెండు రూపాయలకు పరిమితం చేశారు. రైతులు అన్యాయం అయిపోయారు.
మిర్చి రైతుల గురించి కేంద్రానికి లేఖ రాసి మమ అనిపించారు. పొగాకు రైతుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. 24 గంటల్లో డబ్బులు వేస్తామన్నారు. మూడు నెలలకు కూడా డబ్బులు వేయలేదు. వైఎస్ జగన్ హయాంలో సున్నా వడ్డీతో రుణాలు ఇప్పించారు. రైతు పంట పండించకపోతే ఏ ప్రజాప్రతినిధి మనుగడ సాధించలేరు. వ్యవసాయం అవసరం లేకపోతే మీరు ఆకలికి ట్యాబ్లెట్ కనిపెట్టండి. గతేడాది అన్నదాత సుఖీభవ సొమ్ముతో కలిపి లబ్ధిదారులకు చెల్లించాలి. రోజుకు 450 కోట్లు అప్పు చేస్తూ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు అని విమర్శలు చేశారు.