సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, కానీ ప్రభుత్వం మాత్రం బీచ్‌ల్లో బార్లు ఏర్పాటు చేయడంపైనే దృష్టి పెట్టిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి రైతుల ఉసురు తగిలితే గాలికి కొట్టుకుపోతారని మండిపడ్డారు.
తాడేపల్లిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అన్నపూర్ణగా పిలుచుకునే ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో అనేక మంది రైతులు తనువు చాలించారు. ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే తీరిక లేదు. కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 60 నుంచి 65 శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. ప్రతిపక్ష నేతలను తిట్టడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. మంచి పనులు చేయటం మీద దృష్టి పెట్టకుండా నిత్యం వైఎస్ జగన్ మీద విషం చిమ్మే పనిలో ఉన్నారు.
గతేదాడి వేలాది మంది రైతులు ఎరువులు, విత్తనాలు దొరక్క ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు ఎరువుల మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోలేదు. ప్రతీ విషయంలో మోసం చేయటం చంద్రబాబు నైజం. రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేస్తా అన్నారు.. ఇప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్ హయంలో తెచ్చిన ప్రాజెక్టుల వల్ల రైతులు నిలబడ్డారు. జగన్ వచ్చిన తర్వాత 1700 కోట్లు ఖర్చు చేసి 9 గంటలు విద్యుత్ ఇచ్చారు. తోతాపురి మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ఏడాది జగన్ వెళ్ళి ఆందోళన చేస్తే కేసులు పెట్టారు. ప్రతిపక్షంగా మేము గట్టిగా మాట్లాడితే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. రైతులకు కావాల్సిన మినిమం సపోర్ట్ కూడా ప్రభుత్వం నుంచి లభించటం లేదు. ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.
గాదె సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు చంపేశారు.. కనీసం డెడ్ బాడీ ఇవ్వాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మేం ఇదే విషయం ప్రశ్నిస్తే కులాల ప్రస్తావన తీసుకువస్తారు. బీచ్‌లో బార్స్ పట్టడానికి ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ బ్లాక్ చేస్తున్నారు. ప్రభుత్వానికి రైతుల ఉసురు తగిలితే గాలికి కొట్టుకుపోతారు. తక్షణమే రైతుల గురించి ఆలోచన చేయాలి’ అని డిమాండ్ చేశారు.


