రేపు అంబేడ్కర్‌ విగ్రహాలకు క్షీరాభిషేకాలు

YSRCP Dalit Leaders Fires On Chandrababu - Sakshi

చంద్రబాబు దుష్ట ఆలోచనలపై నిరసన 

వైఎస్సార్‌సీపీ దళిత ప్రజాప్రతినిధుల పిలుపు 

సెప్టెంబర్‌ మొదటి వారంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు 

దళితులూ వర్సెస్‌ చంద్రబాబు పేరుతో రాష్ట్రవ్యాప్త కార్యక్రమం

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ జరిగిన అకృత్యాలపై నిరసన తెలుపుతూ ఈ నెల 31న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు క్షీరాభిషేకం చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు ప్రకటించారు. అలాగే, సెప్టెంబర్‌ మొదటి వారంలో అన్ని జిల్లాలకు వెళ్లి దళిత మేధావులు ప్రజాసంఘాలు, సోషల్‌ ఆర్గనైజర్లతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు పాలనలో దళితుల పట్ల అమానవీయంగా వ్యవహరించిన తీరు, దళితులపై జరిగిన దాడులు, సాంఘిక వెలివేతలు, రాజ్యాంగం కల్పించిన హక్కులను నీరుగార్చిన వైనంపై చర్చిస్తామని వారు చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. తన హయాంలో దళితులపట్ల అరాచకాలకు పాల్పడ్డారన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ‘దళితులూ వర్సెస్‌ చంద్రబాబు’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపడతామన్నారు. వీరిరువురూ ఇంకా ఏమన్నారంటే..

► దళితులకు, అణగారిన వర్గాలకు వైఎస్‌ జగన్‌ సర్కారు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు చంద్రబాబు అకృత్యాలను ప్రజల ముందుంచుతాం. 
► చంద్రబాబు తొలి నుంచీ దళిత వ్యతిరేకి. అధికారంలో ఉన్నపుడు దళితులపట్ల చులకనగా వ్యవహరించి, ఇప్పుడు వారిపై మొసలికన్నీరు కారుస్తున్నారు.
► చంద్రబాబు నాయుడు హయాంలో.. దళి తులపై అకృత్యాల విషయంలో ఏపీ నాలుగో స్థానంలో వుంది. 
► తూర్పు గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో దళితులపై జరిగిన దాడుల్లో  బాధ్యులపై సీఎం జగన్‌ కఠిన చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ఏనాడైనా ఇలా స్పందించారా? 
► రాష్ట్రంలో పేద వర్గాలకు జగన్‌ సంకల్పించిన మేలును అడ్డుకుంటున్న చంద్రబాబు దుష్ట ఆలోచనలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తాం.

చంద్రబాబు తీరుపై ఆగ్రహం
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, వివిధ జిల్లాల ఎస్సీ సెల్‌ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశమై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు దళితులకు, బడుగు, బలహీనవర్గాలకు అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై చర్చించారు. దళిత వ్యతిరేకి అయిన చంద్రబాబు ఒక్కసారిగా దళితులపై ప్రేమను కనబరుస్తుండడంపై సమావేశంలో పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు కె. రక్షణనిధి, పి. జగన్‌మోహన్‌ రావు, కైలే అనిల్‌కుమార్, ఎలీజా, కంబాల జోగులు, కిలివేటి సంజీవయ్య,  టీజేఆర్‌ సుధాకర్‌బాబు, తలారి వెంకట్రావు, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ, ఎస్సీ సెల్‌ నాయకులు క్రిస్టీనా, కాలే పుల్లారావు, డేవిడ్‌ రాజు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top