హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?: వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan condemns coalition governments vindictive actions | Sakshi
Sakshi News home page

హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?: వైఎస్‌ జగన్‌

Sep 8 2026 8:40 PM | Updated on Sep 8 2026 10:01 PM

YSRCP Chief YS Jagan condemns coalition governments vindictive actions

తాడేపల్లి : ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి కేసులు పెట్టడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలిపిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ’ఎక్స్‌’ వేదికగా కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు వైఎస్‌ జగన్‌. 

‘కాకినాడలో మెగా పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులపై కక్షపూరితంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది.  శ్యామ్, టి.రాజా, ఎం.గంగా సూరిబాబు, రాజేష్‌తో పాటు 20 మంది పోలీస్ ఉద్యోగ అభ్యర్థులపై కేసులు నమోదు చేయడం దారుణం. ‘

‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడం, ఉద్యోగాల భర్తీ కోరడమే వారు చేసిన నేరమా?, ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా నేరంగా మారిందా?, అధికారంలోకి రావడానికి యువతకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 

20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు. . మూడేళ్లకు రూ.21,600 కోట్ల నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా..యువతను మోసం చేసిన ప్రభుత్వం..ఇప్పుడు ఉద్యోగాలు అడిగిన వారిపై కేసులు పెట్టి వేధిస్తోంది. మెగా డీఎస్సీ స్కాంలో రోజుకో కొత్త ఆధారం బయటపడుతున్నా..సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేష్ అణచివేత, సెన్సార్‌షిప్, బెదిరింపులకు పాల్పడుతున్నారు. 

అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ ఇస్తూ నిజమైన నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ అడిగితే మాత్రం కేసులా?, ఇది కూటమి ప్రభుత్వ యువత వ్యతిరేక, ప్రజాస్వామ్య విరుద్ధ వైఖరికి నిదర్శనం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా రిక్రూట్‌మెంట్ స్కాంలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకులు, నియామకాల్లో అక్రమాలు పరిపాటిగా మారుతున్నాయి. యువత ఆశలు, ఆకాంక్షలను గౌరవించడం టీడీపీకి ఎప్పుడూ చేతకాలేదు. పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించడం కంటే.. అవినీతి, రాజకీయ మాయాజాలానికే ప్రాధాన్యం ఇస్తోంది.

నిరుద్యోగ యువతపై నమోదు చేసిన అన్ని కేసులను తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. మెగా పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువతకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు. 

 డీఎస్సీ అక్రమాలపై కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement