‘నిరుద్యోగుల సంఖ్యను పెంచేస్తున్న చంద్రబాబు!’ | YSRCP Ambati Criticise CM Chandrababu Unemployment In AP | Sakshi
Sakshi News home page

‘ఏపీలో నిరుద్యోగుల సంఖ్యను పెంచేస్తున్న చంద్రబాబు!’

Dec 24 2024 6:24 PM | Updated on Dec 24 2024 7:56 PM

YSRCP Ambati Criticise CM Chandrababu Unemployment In AP

గుంటూరు, సాక్షి: ఏపీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించడం లేదు.. దోచుకుంటున్నారని,  ప్రభుత్వ రంగంలోకి సంస్థలను అమ్మేసి దండుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మంగళవారం సాయంత్రం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘కూటమి నేతలు ఎ‍న్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చారు. ‘ఓటేయండి తమ్ముళ్లు’ అంటూ వేడుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. ప్రజలపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు. ‘బాదుడే బాదుడు..’ అంటూ రూ. 15 వేల కోట్ల విద్యుత్‌ ఛార్జీలు భారం మోపారు.   ఇదేనా సంపద సృష్టి.. ఇదేనా ఆదాయం పెంచడం?’’ అని అంబటి ప్రశ్నించారు . 

.. రాష్ట్ర ఆదాయం పడిపోయింది. రాజధాని పేరుతో 31 వేల కోట్ల అప్పులు చేస్తున్నారు.  అప్పు కోసం చిప్ప పట్టుకుని తిరుగుతున్నారు. అప్పులతోనే చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.  ఆనాడు స్మార్ట్‌ మీటర్లపై తప్పుడు ప్రచారం చేశారు. స్మార్ట్‌ మీటర్లను పగలగొట్టమని రెచ్చగొట్టారు.  ఇప్పుడు మళ్లీ స్మార్ట్‌ మీటర్లు బిగించే కార్యక్రమం మొదలుపెట్టారు అని అంబటి మండిపడ్డారు.

.. వైఎస్సార్‌సీపీ(YSRCP) హయాంలో  నిరుద్యోగ సమస్యను పరిష్కరించాం. మా హయాంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. 1.34 లక్షల మందికి గ్రామ, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేశాం. కానీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు సృష్టించి ఇస్తామన్నారు. లేదంటే నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. అయితే.. 

ఇప్పుడు చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. వలంటీర్లను పక్కన పెట్టి.. వెల్త్‌ వర్కర్లను తొలగించారు. ఇప్పుడు ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ నుంచి ఏకంగా 400 మందిని తొలగించారు. చంద్రబాబు ఏపీలో నిరుద్యోగుల సంఖ్యను పంచేస్తున్నారు. కానీ నిరుద్యోగ భృతిని మాత్రం ఇవ్వడం లేదు’’ అని అంబటి అన్నారు.

ఇదీ చదవండి: మన కేసులు ఎత్తేద్దాం!

Advertisement
 
Advertisement
Advertisement