ఇదేం ఖర్మ బాబూ!

YSR Kadapa: Tickets Issue in TDP an Unsettled situation - Sakshi

సాక్షి, కడప: టీడీపీ అధిష్టానం తీరుపై జిల్లాలోని ఆ పార్టీ నేతలు, ప్రధానంగా నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆగ్రహంతో ఉన్నారు. ఆది నుండి పార్టీ కోసం పనిచేస్తున్నా రాబోయే ఎన్నికల్లో టిక్కెట్‌ విషయంపై అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంతో నేతలు జీర్ణించుకోలేకున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిల హోదాలో పార్టీ ఎదుగుదల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టుకున్నా.. ఇప్పుడు సర్వేల పేరుతో టిక్కెట్‌ విషయం తేల్చకపోవడంపై నేతలు గుర్రుగా ఉన్నారు. మరో ఆరు నెలలపాటు పార్టీ అభివృద్ధి కోసం ఎవరు బాగా పనిచేస్తే రాబిన్‌శర్మ బృందం సర్వేలో వారి పేరే వస్తుందని, అలాంటి వారికే టిక్కెట్‌ అంటూ అధిష్టానం మెలిక పెట్టింది. సర్వే సాకుతో ఇన్నాళ్లు పార్టీని మోసిన తమకు చివరి నిమిషంలో అధిష్టానం వంచించే పరిస్థితికి చేరడంపై సదరు నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.

జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీంతో నియోజకవర్గ ఇన్‌చార్జిల్లో నిర్లిప్తత నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధిష్టానం కార్యక్రమాలకు పిలుపునిచ్చినా ఆ పార్టీ నేతలు స్పందించే పరిస్థితి లేదు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధిష్టానం ప్రకటించిన ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం తమ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. మరోవైపు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్‌ నాకంటే నాకంటూ ఉన్న కొద్దిమంది నేతలు ప్రచారం చేసుకుంటుడడంతో పార్టీలో మరింత గందరగోళం నెలకొంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్న క్యాడర్‌ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకరిపై ఒకరు చంద్రబాబు, లోకేష్‌లకు ఫిర్యాదులు చేసుకుంటూ రోడ్డెక్కుతున్నారు. 

►కమలాపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పలుమార్లు ఓటమి చెందిన పుత్తా నరసింహారెడ్డిని కాదని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి రాబోయే ఎన్నికల్లో  టిక్కెట్‌ లభిస్తుందని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. ఇప్పటికే వీరశివారెడ్డి చంద్రబాబును కలిశారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన తమ నేతకే పార్టీ టిక్కెట్‌ అంటూ పుత్తా నరసింహారెడ్డి వర్గం చెబుతోంది. 

►ప్రొద్దుటూరులో వీరశివారెడ్డి సోదరుడి కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆది నుండి పార్టీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తనకే టిక్కెట్‌ అంటూ  ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గం రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ తమకేనంటూ ప్రచారం చేసుకుంటోంది. అయితే వరదరాజులరెడ్డి ఇటీవల కర్నూలు జిల్లాలో రాహుల్‌గాంధీని కలిసి ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో వరద రాజులరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

►మైదుకూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఈసారి కూడా తనకే టిక్కెట్‌ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేతను కలిసిన మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి సైతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ నాకేనంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే డీఎల్‌ అవుట్‌ డేటెడ్‌ నేతగా  గుర్తించిన టీడీపీ ఆయనకు టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితి కానరావడం లేదన్న ప్రచారమూ ఉంది. ఇక్కడ ఎవరికి టిక్కెట్‌ ఇస్తారన్న విషయం అధిష్టానం తేల్చలేదు. 

►ఎస్సీ రిజర్వుడు స్థానమైన బద్వేలు నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖర్‌కు నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దివంగత వీరారెడ్డి కుటుంబంతో విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో కొత్త అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థి ఎవరన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. 

►కడప నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన అమీర్‌బాబు ఈ దఫా కూడా టీడీపీ టిక్కెట్‌ ఆశిస్తుండగా, నాన్‌ మైనార్టీ కోటాలో  ఈ దఫా తనకే టిక్కెట్‌ ఇవ్వాలంటూ ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి కుటుంబం గట్టిగా పట్టుబడుతోంది. ఇక్కడ కూడా ఎవరికి టిక్కెట్‌ విషయమై అధిష్టానం స్పష్టత ఇవ్వలేదు. 

►ఇప్పటికే కడప పార్లమెంటు అభ్యర్థిగా రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డిని ఆరు నెలల క్రితమే చంద్రబాబు ప్రకటించారు. అయినా శ్రీనివాసులురెడ్డి మొక్కుబడిగా మాత్రమే కనిపిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికల్లో సీనియర్లను కాదని, కొత్త వారికి టిక్కెట్లు ఇప్పించేందుకు శ్రీనివాసులురెడ్డి ప్రయత్నిస్తున్నారని ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, బద్వేలు తదితర ప్రాంతాలకు చెందిన నేతలు ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. రోజురోజుకు ఆ పార్టీలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వర్గ విభేదాలు రోడ్డున పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చక చోద్యం చూస్తుండడంతో ఆ పార్టీ నేతలు ఎటూ తేల్చుకోలేక సందిగ్ధావస్థలో పడ్డారు.     

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top