
భువనగిరి, భువనగిరి క్రైం: రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చెప్పారు. కుటుంబానికి రూ. లక్ష కూడా ఇవ్వలేని సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై రూ.4 లక్షల భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి బార్లు, బీర్లు, అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.
పాదయాత్రలో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. దమ్ము ఉంటే కేసీఆర్, కేటీఆర్ తనతో కలిసి ఒక రోజు పాదయాత్ర చేయాలని షర్మిల సవాల్ విసిరారు. గ్రామాల్లో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్తానని సమస్యలు ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని అన్నారు.