రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ జగన్
తన అవినీతిని, దోపిడీని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న చంద్రబాబు
చట్టాన్ని, పోలీసు వ్యవస్థను చేతుల్లోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తున్న సీఎం
రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు.. భయం రాజ్యమేలుతోంది.. సాయికృష్ణను లాకప్‌డెత్ చేసి శవం మాయం చేసేశారు.. 46 రోజుల పాటు తల్లికి బూడిద కూడా ఇవ్వకుండా కేసును కప్పెట్టేశారు
నేను వెళ్లిన నాలుగురోజులకు గానీ అరెస్టులు చేయలేదు.. శవాన్ని మాయం చేసినట్టుగానే
సీసీఫుటేజి కూడా మాయం.. మరి విజయవాడలోని పబ్లిక్ ప్లేస్‌లలో ఫుటేజి ఏమైంది?
క్లౌడ్ సర్వర్‌లలో 90 రోజులపాటు ఉండాల్సిన ఫుటేజి ఎక్కడ?
పోలీసు అధికారుల ఫోన్లు, మెసేజ్‌లు, కాల్ రికార్డ్స్ ఎందుకు పరిశీలించడం లేదు?
ఆ తల్లి వేదన పడుతూ పెట్టుకున్న అర్జీలకు విలువ లేదా?
పోలీసు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ మరణవాంగ్మూలానికి విలువ లేదా?
కర్నూల్‌లో గంగమ్మ, తెనాలిలో తిరుపతమ్మ, శ్రీకాకుళంలో కళావతమ్మ లాకప్‌డెత్‌లదీ ఇదే కథ
రాజధాని రైతుల కష్టాలను చూడడానికి వారి ఆహా్వనం మేరకు వెళ్తుంటే వైస్సార్‌సీపీ నేతలపై దాడులు
పైగా బాధితులైన వైఎస్సార్‌సీపీ నేతలే నిందితులంటూ ఎదురు కేసులు
చంద్రబాబు అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలను ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు
‘‘సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7.26 గంటలకు విజయవాడ సీపీకీ అర్జీ పెట్టుకుంది. ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత సాయికృష్ణ బంధువులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పట్టించుకోలేదు. రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సీఐని సీపీ కాపాడతాడు. సీపీని డీజీపీ కాపాడతాడు. డీజీపీని చంద్రబాబు కాపాడతాడు. ఇవన్నీ రాష్ట్రంలో మన కళ్లెదుట కన్పిస్తున్న సాక్ష్యాలు. కుప్పకూలిన, దిగజారిన పోలీస్ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి.’’
‘‘సాయికృష్ణ కోసం ఆ తల్లి వేదన పడుతూ రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ పెట్టుకున్న అర్జీలకు విలువ లేదా? ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ ఇచ్చిన మరణ వాంగ్మూలానికి విలువ లేదా? జగన్ వెళ్తే కానీ అరెస్ట్‌లు మొదలు కాలేదు. ఆ అరెస్ట్‌లను చిన్న చిన్నోళ్లకు పరిమితం చేశారు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సీపీని, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యులు చేయడం లేదని అడుగుతున్నా? ’’
‘‘18 నెలల సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు రిమాండ్ రిపోర్టులో రాశారు. అంటే ఈ 18 నెలల్లో ఎన్ని మర్డర్లు జరిగాయో? రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పైగా సీపీ, డీజీపీ, చంద్రబాబు, హోంమంత్రి కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నా... సీసీ ఫుటేజ్ మాయమవడం ఎలా సాధ్యం? ఎవరికి నచ్చినట్టు వాళ్లు డిలీట్ చేసుకుంటూ పోవడమేమిటి? ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్‌లు ఎందుకు? ఇక్కడ డిలీట్ చేస్తే... కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫుటేజ్ ఉండదా? అక్కడ ఏమైనట్టు?’’
‘‘అమరావతిలో జరిగే ప్రతీ పనిలోనూ కన్పించేది అవినీతి, దోపిడీయే... కేంద్రప్రభుత్వం అమరావతిలో కడుతున్న ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.4,645 అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్, కేంద్ర కేబినెట్‌లో ఈ మేరకు అప్రూవల్ ఇచ్చింది. అదే అమరావతిలో చంద్రబాబు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన చేస్తున్న ఖర్చు చదరపు అడుగుకు అక్షరాలా రూ.20,439.’’
‘‘రెండేళ్ల క్రితం ఏ ఇంట్లో అయినా సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు చేసిన మంచి గురించి చర్చ జరిగేది. కానీ నేడు ఏ ఇంటికి వెళ్లినా రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత శవాలను మాయం చేయడం, చంద్రబాబు చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఆయన చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న టాపిక్ డైవర్షన్లు, ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోట్లపైనే చర్చ జరుగుతోంది.’’
‘‘జంగిల్ రాజ్ అంటే బిహార్‌లో ఉంటుందని అంటారు. కానీ ఆంధ్రాలో కూడా జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబు జంగిల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారు. రాజధాని ప్రాంతానికి వెళ్లిన మా పార్టీ నాయకులపై దాడి చేయడమే కాకుండా వారిని నిందితులుగా చూపిస్తూ కేసులు పెట్టిన ఘటనలు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. న్యాయం, ధర్మం అనేది పూర్తిగా భూస్థాపితం చేశారనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు.’’
-వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా(చట్టం) పక్కకు పోయి మొత్తం ‘రూల్ ఆఫ్ ఫియర్’(భయం) రాజ్యమేలుతోంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లిపోయింది. ఇక్కడ జంగిల్‌రాజ్ పాలన సాగుతోంది.’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎదురు లేదని, తామేం చేసినా చెల్లుతుందన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలి ఉందని, రాష్ట్రంలో న్యాయం, ధర్మం గాడితప్పాయని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు తాను చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలనతో పాటు, తాను మోసం చేసిన సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లపై ప్రశ్నించేవారి గొంతు నొక్కడం కోసం చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తున్నారని ఎత్తిచూపారు. సాయికృష్ణ లాకప్‌డెత్, శవాన్ని మాయం చేయడం, పోలీసుల వేధింపులతో క్రాంతికుమార్ ఆత్మహత్య రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడతాయని అన్నారు. చివరకు తాను వెళ్లి సాయికృష్ణ కుటుంబాన్ని కలిసే వరకు, ప్రభుత్వంలో చలనం రాలేదని, దాదాపు 46 రోజుల పాటు గోప్యంగా ఉంచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టే అంటున్నాం.. ‘‘హే రామ్.. సేవ్ ఆంధ్ర’’ అని జగన్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను చంద్రబాబు సర్కార్ ఆయుధంగా మార్చుకుని.. వ్యవస్థలను దిగజార్చి సాగిస్తున్న భీతావహపాలనను సాక్ష్యాధారాలతో సహా ఎత్తిచూపుతూ కడిగిపారేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..
రాష్ట్రంలో భయం రాజ్యమేలుతోంది..
‘‘రెండేళ్ల క్రితం వరకు ఏ ఇంట్లో అయినా.. సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు చేసిన మంచి గురించి చర్చ జరిగేది. కానీ నేడు ఏ ఇంటికి వెళ్లినా రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత శవాలను మాయం చేయడం, చంద్రబాబు చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఆయన చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న టాపిక్ డైవర్షన్లు, ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోట్లపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే? చట్టం, న్యాయం (రూల్ ఆఫ్ లా) పక్కకు పోయి భయం(రూల్ ఆఫ్ ఫియర్) రాజ్యమేలుతోంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో పూర్తిగా సన్నగిల్లిపోయాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలన, తాను చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఎన్నికలప్పుడు ఆయనిచ్చిన బాండ్ల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే చాలు.... ఆ ప్రశ్నించే గొంతును నొక్కే కార్యక్రమం జరుగుతోంది. చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను చంద్రబాబు తన చేతుల్లో తీసుకున్నారు.. ఎవరైనా తనను ప్రశ్నిస్తే.. అది ప్రతిపక్ష పార్టీ నేతలైనా, సోషల్ మీడియా కార్యకర్తలైనా, జర్నలిస్టులైనా.. వారిని అణిచివేసే కార్యక్రమం జరుగుతోంది. ఇందుకోసం చట్టాలను, పోలీస్ వ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారు.
వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి
వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. ఇవాళ మనం చూస్తున్న ఈ దుర్మార్గాలన్నీ కూడా దాని పర్యవసానాలే. రాష్ట్రంలో న్యాయం, ధర్మం గాడితప్పింది. పాలించే వారిలో భయమనేది పోయింది. మనం మనుషులమేనన్న సంగతి మరిచిపోయి, ఒక మనిíÙని మనం ఏం చేసినా అడిగే వాడు ఉండడనే ధైర్యం అసలు ఎక్కడ నుంచి వచ్చింది? ఇది ప్రభుత్వం తప్పు కాదా? విజయవాడలో మొన్న జరిగిన సాయికృష్ణ కేసు తీసుకున్నా, పోలీసుల వేధింపులకు గురై క్రాంతికుమార్ అనే అబ్బాయి వీడియో చేసి మరణవాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్‌కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు, తెనాలిలో తిరుపతమ్మ కేసు, శ్రీకాకుళం సంతకవిటికి చెందిన కళావతి కేసు రాష్ట్రంలో నెలకొన్న భయానక వాతావరణానికి అద్దంపడతాయి. కస్టడీలోకి తీసుకొని ఒక మనిíÙని దారుణంగా కొట్టి చంపి, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ లేకుండా చేసి, చివరికి శవం కూడా మాయం చేసి ఆ శవం ఎక్కడ ఉందో ఏం చేశారో ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు కూడా బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగింది. ఇది రాజధానిలో.. చంద్రబాబు ఇంటికి ఆమడదూరంలో జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ నివ్వెరపోయిన ఘటన ఇది. ఒక్కొక్కటిగా ఇలాంటి ఘటనలు బయటకొస్తున్నా చంద్రబాబును ఎవరూ నిలదీయకూడదట. వీటి కోసం ప్రశ్నిస్తే, నిలదీస్తే సమాధానం చెప్పాల్సింది పోయి, క్రిమినల్స్‌కు మద్దతు ఇస్తారా అంటూ ఎదురు దాడి చేయడమే కాకుండా.. తమకు తానా తందానా అనే ఎల్లో మీడియాలో ఇదే మాదిరిగా రాతలురాయిస్తూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు.
అధికారులను కాపాడుతున్న చంద్రబాబు ఇంట్రస్ట్ ఏమిటి?
సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్‌ఫోర్స్ పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు అప్పగించిన తర్వాత ఎక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకున్నారు. రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా రాశారు. మరి ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? ఈ ఘటన మే 6వతేదీన జరిగింది. తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోవాలని సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7.26 గంటలకు ఇదే విజయవాడ సీపీకీ అర్జీ పెట్టుకుంది. కానీ సీపీ పట్టించుకోలేదు. ఆ తర్వాత సాయికృష్ణ బంధువులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పట్టించుకోలేదు. రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సీఐని సీపీ కాపాడతాడు. సీపీని డీజీపీ కాపాడతాడు. డీజీపీని చంద్రబాబు కాపాడతాడు. ఇవన్నీ రాష్ట్రంలో మన కళ్లెదుట కన్పిస్తున్న సాక్ష్యాలు. కుప్పకూలిన, దిగజారిన పోలీస్ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి.
క్రాంతికుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా?
మరో ఘటనలో దళిత యువకుడు క్రాంతి కుమార్ మరణవాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చావుకు కారణం ఇదే కృష్ణ లంక పోలీస్ స్టేషన్, ఇదే సీఐ కారణమని చెబుతూ మరణవాంగ్మూలం ఇచ్చిన ఘటన కూడా ఇదే సీపీ పరిధిలో జరిగినా సీపీ, డీజీపీలు ఏం చేస్తున్నారు? క్రాంతికుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా? తనకొడుకు సాయి కృష్ణ కోసం ఆ తల్లి వేదన పడుతూ రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అర్జీలు పెట్టుకుంటే విలువ లేదా? ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ ఇచ్చిన మరణవాంగ్మూలానికి విలువ లేదా? జగన్ వెళ్తే కానీ అరెస్ట్‌లు మొదలు కాలేదు. ఆ అరెస్ట్‌ల్లో కూడా చిన్న చిన్నోళ్లను పరిమితం చేశారు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సీపీని, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యులు చేయడం లేదని అడుగుతున్నా? ఇంతగా బరితెగించి సీఐ నుంచి డీజీపీ వరకు అధికారులను కాపాడుతున్న చంద్రబాబు ఇంట్రస్ట్ ఏమిటి? ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును కవరప్ చేస్తున్నారని అడుగుతున్నా ? అసలు ఈ ఘటన ఇంత పెద్దది కాకపోయినా, జగన్ వెళ్లకపోయినా ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చేది కాదు.. పూర్తిగా కవరప్ చేసేవారు.
ప్రశ్నిస్తే ఎన్టీఆర్‌ను కూడా రౌడీషీటర్ అనే వారు..
నిజంగా విలన్లను ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం. కానీ చంద్రబాబు రూపంలో ఇక్కడే మన కళ్లెదుటే మనకు విలన్లు కన్పిస్తున్నారు. ఇవన్నీ దారుణాలు కావా? దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నాయకులు రౌడీషీటర్లట..రౌడీలను పెట్టుకుంది నువ్వు. దాడి చేసింది, కొట్టించింది, కారు అద్దాలు పగలు కొట్టింది నువ్వు. తిరిగి మా వాళ్లను రౌడీలంటావా? నిజంగా ఎన్టీఆర్ బతికి ఉండి ఉంటే.. చంద్రబాబును ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండి ఉంటే.. ఆయన్ని కూడా రౌడీషీటర్ అనే వారు. ఎన్టీఆర్ అయినా, లక్ష్మీపార్వతి అయినా అంతే. చంద్రబాబును ప్రశ్నిస్తే రౌడీషీటర్ అంటారు. చంద్రబాబు పాలనలో ఎవరికైనా ఎక్కడైనా రక్షణ ఉంటుందా? అని అడుగుతా ఉన్నా. వీడియోలలో.. రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్.. ధ్వంసమైన కారు.. రాయి పట్టుకుని ఉన్న టీడీపీ నేతలు పెంచలయ్య, మట్టిమాఫియా నేత నాగరాజు.. టీడీపీ గూండాలను దాడికి పురికొల్పుతున్న లోకేశ్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ.. కనిపిస్తున్నారు.. పోలీసుల సమక్షంలోనే రాళ్లు పట్టుకొని దాడులు చేస్తున్నారు.
కారు పగలగొడుతున్నారు. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు దెబ్బలు తగిలాయి. మా వాళ్ల మీద ఎందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు. అదేమైనా పాకిస్థాన్ బోర్డరా? కొంతమంది పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం. ఇప్పటి వరకు మా వాళ్లు పెట్టిన ఫిర్యాదులపై కేసులు పెట్టలేదు. ఏ తెలుగుదేశం వాళ్లను అరెస్ట్ చేయలేదు.. నిజంగా రైతులు ఏం తప్పు చేశారని అడుగుతున్నా. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా భూములు ఎందుకయ్యా అని ఆ రైతులు అడుగుతున్నారు. కేవలం చంద్రబాబు తమ బినామీలకు, నాయకులకు ఆ భూములు పంచడానికి మమ్మల్ని నాశనం చేస్తారా? అని రాజధాని ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. నీ స్వార్థం కోసం భూములు తీసుకొని మమ్మల్ని మా గ్రామాల నుంచి వెళ్లగొడతారా? అని రైతులు నిలదీస్తున్నారు.
చంద్రబాబు, ఆయన పార్టనర్ అధికారిక ప్రకటన చేయగలరా?
అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్ర పూరితంగా సీసీ ఫుటేజ్, శవం మాయం చేయడం, చివరకు ఆ తల్లికి బూడిద కూడా ఇవ్వని అమానవీయ ఘటనపై ఎల్లోమీడియాలో అక్షరం ముక్క రాయరు. పైగా తానా తందానా అంటూ చంద్రబాబుకు భజన చేస్తారు. రౌడీ షీటర్‌కు సపోర్ట్ చేస్తారా అంటూ ఎదురుదాడి చేస్తారు. ఈ టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు పార్టనర్ కూడా ఒక సైడ్ క్యారెక్టర్ మాదిరిగా తెరపైకి వచ్చి అందరూ కలిసికట్టుగా పొలిటికల్ డ్రామాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం లేదని, కోర్టులతో తమకు పనిలేదని, తమకు ఏది అనిపిస్తే అది చేస్తామని, తమ చేతుల్లో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని దొంగ కేసులు పెడతామని, చంపుతామని, శవాలు మాయం చేస్తామని, బూడిద కూడా ఇవ్వమని అధికారిక ప్రకటన చేయగలరా? అని చంద్రబాబును, ఆయన పార్టనర్‌ని సూటిగా ప్రశ్నిస్తున్నా. కవరప్‌లో భాగంగా సాయికృష్ణ మొదట రౌడీషీటర్ అన్నారు. రౌడీషీటర్‌ను వెనకేసుకొస్తారా అని ఎదురు దాడి చేశారు. జనం ఎప్పుడైతే ఛీ కొట్టడం మొదలు పెట్టారో వెంటనే యూ టర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు సాయికృష్ణ కుటుంబ సభ్యులను సెక్రటేరియట్‌కు పిలిపించుకుని పక్కన కూర్చో పెట్టుకొని చేయి పట్టుకుని న్యాయం చేస్తానంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు.. ఏకంగా 46 రోజుల పాటు బయటకు రాకుండా తొక్కిపెట్టిన ఈ ఘటనతో యావత్ దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది.
నేను వెళ్లాకే అరెస్టులు
నేను వెళ్లిన నాలుగు రోజుల తర్వాత అరెస్ట్‌లు ప్రారంభించారు. 46 రోజుల పాటు ఈ కేసును ఎందుకు తొక్కిపెట్టారు, అసలు ఏం జరిగింది? దీనికి వెనుక ఉన్న పెద్దల మీద చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రిపైన లేదా అని అడుగుతున్నా. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ చంద్రబాబులో కానీ, ఈ ప్రభుత్వంలో కానీ చిత్తశుద్ధి లేదు. ఎక్కడా ఏ కోశానా పశ్చాత్తాపం కన్పించలేదు. సాయికృష్ణ రిమాండ్ రిపోర్టు చూస్తే.. సాగుతున్న దర్యాప్తును ఒక్కసారి గమనిస్తే కేసును నిర్వీర్యం చేసేందుకు, పైవాళ్లను కాపాడేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో ఆధారాలతో సహా చాలా స్పష్టంగా కన్పిస్తుంది.
18 నెలలుగా సీసీ ఫుటేజ్ లేదంటున్నారు.. ఇంకెన్ని హత్యలు జరిగాయో
మోసపూరిత కుట్ర ఎంత లోతుగా ఉందో మరో ఉదాహరణ... కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో వీళ్లు ఫైల్ చేసిన మొదటి రిమాండ్ రిపోర్టులో మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వీడియో ఫుటేజ్ లేదని రాశారు. ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ల రిమాండ్ రిపోర్టులో 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు రాస్తారు. అంటే ఈ 18 నెలల్లో ఎన్ని మర్డర్లు జరిగాయో? రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పైగా సీపీ, డీజీపీ, చంద్రబాబు, హోంమంత్రి కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నా... సీసీ ఫుటేజ్ మాయమవడం ఎలా సాధ్యమని అడుగుతున్నా.. ఎవరికి నచ్చినట్టు వాళ్లు డిలీట్ చేసుకుంటూ పోవడానికి ఎలా కుదురుతుంది. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్‌లు ఎందుకు? ఇక్కడ డిలీట్ చేస్తే.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫుటేజ్ ఉండదా? అక్కడ ఏమైనట్టు? ఒకచోట డిలీట్ చేస్తే మరొక చోటైనా ఉంటుంది కదా? సీపీ, డీజీపీ కార్యాలయాల్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? పోలీస్ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం.
స్టేషన్‌లో ఫుటేజ్‌లో లేదంటున్నారు. విజయవాడలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, రోడ్ జంక్షన్లు, పబ్లిక్ ప్లేస్‌లలో సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ ఏమైంది. ఆ ఫుటేజ్ ఆధారంగా సాయికృష్ణ శవాన్ని ఎక్కడకు తీసుకెళ్లారో? ఏం చేశారో కనుక్కోవచ్చు కదా.. కానీ సిట్ ఆ దిశగా ఎందుకు పనిచేయడం లేదని అడుగుతున్నాం. మ్యాట్రిక్ సిస్టమ్, క్లౌడ్ సర్వర్‌లలో 90 రోజుల వరకు ఫుటేజ్ అందుబాటులో ఉంటుందని తెలిసినా దాన్ని సిట్ ఎందుకు స్వాదీనం చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నా. సీఐతో పాటు సంబంధిత పోలీస్ బాసుల ఫోన్‌లు, మెసేజ్‌లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల పరిశీలించే కార్యక్రమం ఎందుకు చేయడంలేదు? ఆశ్చర్యమేమిటో తెలుసా ఆర్థిక ఇబ్బందుల వలన కానిస్టేబుళ్ల ఫోన్లు నాగపూర్‌లో అమ్మేశారని చెబుతున్నారు. మనిషిని చంపేశారు. శవాన్ని కన్పించకుండా చేశారు. వీడియో ఫుటేజ్ మాయం చేశారు. ఫోన్లు నాగపూర్‌లో అమ్మేశారు. రాజధాని ప్రాంతంలోనే సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే. మారుమూల ప్రాంతాల్లో ఉండే సామాన్యుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా ఉంది. మానవ హక్కులకు విలువ లేదా?
యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనలు..
చంద్రబాబు పాలనలో వ్యవస్థలు, వాటికి బాధ్యత వహిస్తున్న వాళ్లు ఈ విధంగా కుమ్మక్కవడం కొత్తేమీ కాదు. ఈ రెండేళ్లలో శతకోటి ఉదాహరణలు ఇవ్వొచ్చు. సీసీ ఫుటేజ్ మాయంతో సహా ఆధారాలు నాశనంచేయడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేయడం, న్యాయ స్థానాలను పక్కదోవపట్టించడం, చివరకు కొన్ని కేసుల్లో పోలీసులే స్వయంగా డబ్బులు తీసుకెళ్లి వాళ్ల ఇళ్లల్లో పెట్టి మరీ కేసులు పెడుతున్నారు. ఈ స్థాయిలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. రెండేళ్లుగా రెడ్ బుక్ పాలనలో రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎన్నో చూశాం. ఒకర్ని పిన్ పాయింట్‌గా గుర్తించడం, వాళ్లను బలవంతంగా కేసుల్లో ఇరికించే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడా నైతికత, విలువలు లేకుండా పోయాయి.
అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నామన్న పశ్చాత్తాపం కూడా కన్పించడం లేదు. ఏ స్థాయికి దిగజారిపోయినా పర్వాలేదు. చంద్రబాబు ముఖంలో సంతోషం చూడాలి. అదొక్కటే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే జంగిల్ రాజ్ అనక ఇంకేమనాలి. జంగిల్ రాజ్ అంటే బిహార్‌లో ఉంటుందని అంటారు. కానీ ఆంధ్రాలో కూడా జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబు జంగిల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతారని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో రైతుల కోరిక మేరకు వైఎస్సార్ సీపీకి చెందిన నాయకుల బృందం ఆ గ్రామాలకు వెళ్తే ఏం జరిగిందో మనమంతా చూశాం. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలను, రాజధాని ప్రాంత రైతులు పడుతున్న బాధలను బయట ప్రపంచానికి తెలియనీయకుండా చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.
దాడికి గురైన బాధితులపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు..
రాజధాని ప్రాంతానికి వెళ్లిన మా పార్టీ నాయకులపై దాడి చేయడమే కాకుండా బాధితులైన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నేతలనే నిందితులుగా చూపిస్తూ కేసులు పెడుతున్న ఘటనలు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. న్యాయం, ధర్మం అనేది పూర్తిగా భూస్థాపితం చేశారనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు. ఇదే మీటింగ్ హాలులో ఇటీవలే రాజధాని గ్రామాలకు చెందిన రైతులు నన్ను కలిశారు. తమ గోడు చెప్పుకున్నారు. వాళ్ల కోరిక మేరకు ఒక కమిటీని, లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేశాం. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో మీకు చూపుతాం.. మీరు రండి అని రైతులు అడిగితేనే మా పార్టీ బృందం అక్కడకు వెళ్లింది. ఆ బృందంలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులపై దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.
కార్ల అద్దాలు పగలకొట్టారు. రాళ్లు విసిరారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్ తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. మళ్లీ తిరిగి మా వాళ్లే దాడులు చేసినట్టుగా బాధితులపైనే ఎదురు కేసులు పెట్టారు. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. భూములివ్వని వారిని భూ సేకరణ నోటీసుల పేరిట వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేయడం, ఇంకా దారుణంగా కొండవీటి వాగును వీరి భూముల్లోకి మళ్లించి వాళ్ల భూములు చుట్టూ నీళ్లు నింపేసి చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్లు భూములు వదిలేసుకునే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వమే క్రియేట్ చేస్తోంది.
అమరావతిలో ప్రతీ పనిలోనూ దోపిడీయే..
అమరావతిలో జరిగే ప్రతీ పనిలోనూ కన్పించేది అవినీతి, దోపిడీయే... కేంద్రప్రభుత్వం అమరావతిలో కడుతున్న ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.4,645 అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్, కేంద్ర కేబినెట్‌లో ఈ మేరకు అప్రూవల్ ఇచ్చింది. అదే అమరావతిలో చంద్రబాబు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన చేస్తున్న ఖర్చు చదరపు అడుగుకు అక్షరాలా రూ.20,439. పైగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు. పక్కన తెలంగాణ సెక్రటేరియట్ 10 లక్షల ఎస్‌ఎఫ్‌టీలకు మించి లేదు. ఇది దోపిడీ కాదా ? అని అడుగుతున్నా. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏ నగరం తీసుకున్నా 5స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్‌తో నిర్మించినా చదరపు అడుగుకు రూ.4,500 దాటదు. చివరికి జాతీయ రహదారి నిర్మాణం కిలోమీటర్‌కు రూ.24 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు స్వయంగా ఓ ప్రశ్నకు సమాధానంగా పార్లమెంటులో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కానీ అమరావతిలో ఎంతో తెలుసా ? కిలోమీటర్‌కు సగటున రూ.53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే డబుల్ కంటే ఎక్కువ. ఇవన్నీ బయటకు రాకూడదని, రైతులు పడుతున్న ఇబ్బందులు, వారికి చేస్తున్న అన్యాయం, మోసం, అమరావతి పేరిట చేస్తున్న దోపిడీ బయటకు రాకూడదనే ఈ దాడులకు పాల్పడుతున్నారు.


