
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అకాల వర్షాలకు, వడగళ్ల వానకు నష్టపోయిన అరటి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన పులివెందులలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నష్టపోయిన రైతులను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఆనాడు వైఎస్సార్‌సీపీ తరపున సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నష్టపోయిన ప్రతి హెక్టారుకు రూ.20 వేల సాయం అందిస్తాం. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఒక్క రూపాయి సాయం అందించలేదు. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి’’ అని అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.
‘‘ఇటీవల అకాల వర్షాల వల్ల లింగాల మండలంలో చోటు చేసుకున్న ఉద్యాన పంటల నష్టానికి.. రైతులకు పరిహారం ఇచ్చేందుకు వైఎస్ జగన్ సముఖత వ్యక్తం చేశారు. 630 మంది రైతులకు హెక్టారుకు రూ. 20 వేల చొప్పున పార్టీ తరఫున పరిహారం ఇచ్చేందుకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ పరిహారానికి సంబంధించిన త్వరలోనే ఆయా గ్రామాల వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులందరికీ డీడీలు అందిస్తాం. 630 మందికి రూ. 1.30 కోట్ల పరిహారాన్ని డీడీల రూపంలో అందజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుచుకోవాలి. తన బాధ్యతను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అని అవినాష్‌రెడ్డి హితవు పలికారు.
‘‘రూ.26 కోట్లతో అరటి రైతుల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌ను ఏర్పాటు చేసింది.. కానీ దాని వినియోగంలోకి తీసుకురావడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం విఫలమైంది. పులివెందుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధితో ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ కోల్డ్ స్టోరేజ్ని వినియోగంలోకి తీసుకొచ్చి ఉంటే ధరల స్థిరీకరణకు అవకాశం ఉండేది. ధరల స్థిరీకరణ జరిగితే రైతుకు ప్రయోజనం కలిగేది. గత నెలలో అరటి ధర ఓ మోస్తారుగా ఉండేది. ఇప్పుడు అరటి ధర పడిపోయి రైతుకు గిట్టుబాటు కావడం లేదు
..మెడికల్ కాలేజ్ నిర్మించి 50 సీట్లు మంజూరు అయ్యేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేస్తే.. వచ్చిన సీట్లను వద్దని రాసి పంపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. 6 సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా, కడప నుంచి నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు సీఎం గా గెలిచి పులివెందులను అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు మెడికల్ కాలేజీకి ఆయన పేరును తీసివేసి కూటమి ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుంది. మెడికల్ కాలేజీ మెయిన్ గేట్‌కు ఉన్న వైఎస్సార్ పేరు తొలగిస్తారేమో కానీ.. ఈ ప్రాంత ప్రజల్లో ఆయనకున్న స్థానాన్ని అయితే చెరిపి వేయలేరు. చెయ్యని పనులు చేసినట్లు చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఏ పని ఎవరు చేశారో ప్రజలందరికీ తెలుసు’’ అని వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.
గండి క్షేత్రంలో 26 కోట్లతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్న చిన్న చిన్న పనులు చేయలేక అసంపూర్తిగా వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో గంజాయి రవాణా విస్తృతంగా పెరిగిపోయింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యపానాన్ని కట్టడి చేస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా వీధికి ఒక మద్యం షాపును తెరిచింది’’ అని అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు.