
సినిమాల్లో నటించే పవన్.. ఎన్టీఆర్, చిరంజీవిలాగా రాజకీయాల్లో రాలేదు. తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవకుండా..
సాక్షి, చిత్తూరు: వైఎస్ జగన్ పాలన రామరాజ్యం గనుకే.. మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు. గురువారం జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలం ముద్దికుప్పం సచివాలయం ప్రారంభించిన ఆయన.. జగనన్న మళ్లీ ఎందుకు రావాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆయన హాట్ కామెంట్లు చేశారు.
‘‘తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తూ పవన్ కల్యాణ్.. ఏపీలోనేమో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అసలు నీది ఏ పార్టీ?, ఈ నాటకాలన్నీ ఎందుకు?’’ అని పవన్‌ను నారాయణస్వామి ప్రశ్నించారు. సినిమాల్లో నటించే పవన్.. ఎన్టీఆర్(మాజీ సీఎం), చిరంజీవిలాగా మాదిరిగా రాజకీయాల్లో రాలేదని, తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ, బీజేపీతో పొత్తు, ఏపీలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడని, అలాంటి మోసగాళ్లను నమ్మొద్దని’ ప్రజలను ఉద్దేశించి నారాయణస్వామి ప్రసంగించారు.
సీఎం జగన్ పాలన రామరాజ్యం అని, చంద్రబాబుది రాక్షస రాజ్యం అని.. తెలంగాణలో కాంగ్రెస్‌తో ఒకపక్క చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని, బీజేపీతో దత్తపుత్రుడు మరో పక్క పొత్తు పెట్టుకున్నారని నారాయణస్వామి చురకలంటించారు.