ప్రజారవాణాపై ఎజెండా ఎక్కడ?

Where is the agenda on public transport says Ramachandraiah - Sakshi

పాలకులు, పార్టీలు ఆ దిశగా ఆలోచించడం లేదు 

ప్రజారవాణా వ్యవస్థను ఒక ఉద్యమంలా ప్రమోట్‌ చేయాలి 

 రూ. వేలకోట్లతో మెట్రో, ఫ్లైఓవర్లు కడుతున్నా.. నడవడానికి ఫుట్‌పాత్‌లు లేని పరిస్థితి 

ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రజారవాణా వ్యవస్థ సమగ్రంగా లేకపోవడం బాధాకరం 

రవాణారంగ నిపుణుడు ప్రొఫెసర్‌ సి రామచంద్రయ్య 

‘‘జన జీవనంలో రవాణా వ్యవస్థ అత్యంత కీలకమైనది. కానీ ప్రజారవాణాపై పాలకులకు గానీ రాజకీయపార్టీలకు గానీ ఎజెండా లేకుండా పోతోంది. మేనిఫెస్టోలో ఎన్నో కార్యక్రమాల గురించి చెప్పుకొస్తున్నా.. రవాణా వ్యవస్థపై ఒక నిర్దిష్టమైన ప్రణాళిక  ప్రకటించడం లేదు. సౌకర్యవంతమైన ప్రజారవాణా కల్పిస్తామని హామీ ఇవ్వడం లేదు. ప్రజలకు రవాణా వ్యవస్థ సౌకర్యవంతంగా ఉంటే..బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లే.

అలాంటి ఆదాయం ఇచ్చే వ్యవస్థను  ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరం. రూ. వేల కోట్లతో మెట్రో, ఫ్లైఓవర్లు కడుతున్నా.. రోడ్లపై సురక్షితంగా నడించేందుకు ఫుట్‌పాత్‌లు లేని పరిస్థితి ఉంది..’’ అని రవాణారంగ నిపుణుడు ప్రొఫెసర్‌ సి రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..  

జనాభా పెరుగుతున్నా.. సరిపడా బస్సులేవి?  
పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా  ప్రజారవాణాను అందించే విషయమై పాలకులు దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లక్ష మంది జనా భాకు 60 బస్సులు అవసరం. ఆ లెక్కన కోటి జనాభా దాటిన హైదరాబాద్‌లో ఎన్ని బస్సులుండాలి..? ప్రస్తుతం రాష్ట్రం మొత్తం తిరుగుతున్న బస్సులను హైదరాబాద్‌లోనే తిప్పాల్సి ఉంటుంది.

ప్రయాణికులు వీలైనంత మేర సొంత వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే పరిస్థితి రావాలి. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలి.. ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పుడే ఇటు ప్రభుత్వానికి, అటు ప్రయాణికులకు మంచి జరుగుతుంది. కానీ మన దగ్గర అంతా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్ర పురోగతిని ఇతర రాష్ట్రాలు, దేశాలతో పోల్చే ముందు మన దగ్గర రవాణా వ్యవస్థ, రోడ్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి బేరీజు వేసుకోవాలి. 

చంద్రబాబు ఆర్టీసీని దెబ్బ తీశారు..   
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో ఆర్టీసీ కోలుకోని విధంగా దెబ్బతింది. చార్జీలు అడ్డగోలుగా పెంచుతూ పోయారు, ఫలితం.. ఆర్టీసీలో సమ్మెలకు దారితీసింది. 

పాదచారులు సురక్షితంగా నడిస్తేనే..
కేసీఆర్‌ అధికారంలో ఉన్న ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఆర్టీసీకి ఏవిధమైన ప్రాధాన్యం ఇవ్వలేదు. నగరంలో ప్రజారవాణాకు ఇప్పటికీ ఆర్టీసీనే వెన్నెముక. కానీ దాని పట్ల ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఫ్లైఓవర్ల మీద ఉన్న శ్రద్ధలో వందోశాతం కూడా ఫుట్‌పాత్‌ల మీద లేదు. దాంతో నడవడం, రోడ్లు దాటడం కూడా ప్రమాదకరంగా మారింది. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మూడు శాతం పాదచారులే బలవుతున్నారు. పాదచారులు సురక్షితంగా నడిచే నగరాలనే ప్రపంచ శ్రేణి నగరాలుగా పరిగణిస్తారు. ఎంఎంటీఎస్‌ రెండో దశను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. 

ఫుట్‌పాత్, బస్‌స్టాప్‌లు ఎక్కడ 
అనేక దేశాల్లో ఫుట్‌పాత్‌ అంటే రోడ్డులో ఒక భాగం. కానీ మన దగ్గర మాత్రం ప్రయాణికులు నడవాలంటే సరైన ఫుట్‌పాత్‌లే ఉండవు. ఒక్కసారి ఎర్రగడ్డ నుంచి ఎల్బీనగర్‌ వరకు చూస్తే ఫుట్‌పాత్‌ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం అవుతుంది. రూ.వేల కోట్లతో మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్నా.. పాదచారుల కనీస అవసరమైన ఫుట్‌పాత్‌లను మాత్రం తీవ్రంగా విస్మరిస్తున్నారు. విదేశీ పర్యటనలు చేసి వచ్చే నేతలు అక్కడి ఫుట్‌పాత్‌లను చూసి కూడా తీరు మార్చుకోకపోవటం విడ్డూరం. 

నగరం చుట్టూ సైకిల్‌ ట్రాక్‌ ఉండాలి 
విస్తరిస్తున్న నగరాల్లో సైకిల్‌ ట్రాక్‌ కూడా అందుబాటులో ఉండాలి. అభివృద్ధి చెందిన ఎన్నో నగరాల్లో జనం సైకిళ్లను విస్తృతంగా వాడుతున్నారు. ఇది వాహన రద్దీని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. కానీ హైదరాబాద్‌ నగరం  అలాంటి వ్యవస్థకు దూరంగా ఉంది. ఎక్కడో ఓ చోట నిర్మించాం చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నగరం చుట్టూ సైకిల్‌ ట్రాక్‌ ఉండాలి.   

పీక్‌ అవర్‌పై దృష్టి పెట్టాలి
కీలక సమయాలుగా పేర్కొనే వేళల్లో రోడ్లపై రద్దీని నియంత్రించేందుకు పక్కా ప్రణాళిక అవసరం. ఆయా వేళల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కువగా అందుబాటులో ఉండాలి. హైదరాబాద్‌లో చూడండి.. పీక్‌ అవర్స్‌లో సొంత వాహనాలు రోడ్లను ట్రాఫిక్‌ జామ్‌లతో నింపేస్తున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలను విస్మరించండి అంటూ అభివృద్ధి చెందిన దేశాల్లో సూచనలు కనిపిస్తుంటాయి. ఒకవేళ ఎవరైనా ఆ మార్గాల వైపే వెళ్లాలనుకుంటే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. మనదగ్గర అలాంటి వ్యవస్థ లేదు.  

ఓట్ల కోసమే ఆరాటం తప్ప..  
నేతలు కేవలం ఓట్ల కోసం మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ఎలాంటి అంశాలు చేరిస్తే ఎక్కువ ఓట్లు వస్తాయన్న వాటిపైనే ఆలోచిస్తున్నారు. ప్రజా రవాణాను మెరుగుపరుస్తామని చెబితే పెద్దగా ప్రయోజనం ఉండదనుకుంటున్నారు. అందుకే మేనిఫెస్టోల్లో ఆ అంశాన్ని చేర్చటం లేదు. ప్రజా రవాణా వ్యవస్థపై రాజకీయ పార్టీలకు ఎంత చులకన భావం ఉందో ప్రస్తుత మేనిఫెస్టోలను చూస్తే అర్థం అవుతుంది. 

ప్రజలు బయటికొస్తే ఆదాయం వచ్చినట్టే కదా 
ప్రజా రవాణా వ్యవస్థను గాలికొదిలేయడం వల్ల వ్యక్తిగత వాహనాలు పెరుగుతున్నాయి.చాలా దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ప్రజలు అవసరాల నిమిత్తం రోడ్ల మీదకు వచ్చారంటే ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా ఆదాయం వచ్చినట్లు అనే విషయాన్ని ప్రభుత్వాలు ఎందుకు చూడడంలేదో అర్థం కావడంలేదు.

-గౌటే దేవేందర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top