తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. ఇతర పార్టీలు ఎన్నికల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తుంటే.. ప్రతిపక్ష అన్నాడీఎంకే మాత్రం దూకుడు ప్రదర్శించింది. మొదటి దశ మేనిఫెస్టోను శనివారం ప్రకటించింది. ఎంజీఆర్ జయంతి సందర్భంగా చేసిన ఈ ప్రకటనలో.. తాము అధికారంలోకి వస్తే ఏయే హామీలను నెరవేరుస్తామని వివరించింది. ఇందులో పురుషులకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఐదు కీలక హామీలు ఉన్నాయి.
అన్నాడీఎంకే(AIADMK) జనరల్ సెక్రటరీ పళని స్వామి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తొలి దశ మేనిఫెస్టోను ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం, మగవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం, అమ్మ టూ వీలర్ స్కీమ్ తదితరాలు ఉన్నాయి. వీటి ప్రకారం..
👉మహిళల సంక్షేమం కోసం.. కులవిలక్కు స్కీమ్ అమలు చేస్తామని అంటోంది. ఈ పథకం ప్రకారం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.2 వేల సాయం అందిస్తారు. ఇవి నేరుగా ఆ ఇంటి మహిళల ఖాతాలో జమ అవుతాయి.
👉ఉచిత బస్సు ప్రయాణం.. నగరాల్లోని బస్సుల్లో ప్రస్తుతం మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అమలవుతోంది. అధికారంలోకి వస్తే దానిని కొనసాగిస్తూ.. పురుషులకూ వర్తింపజేస్తామని తెలిపింది.
👉అమ్మా ఇల్లమ్ స్కీమ్.. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వమే జాగా కొని.. కాంక్రీట్ ఇల్లు కట్టి ఇస్తుంది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే అపార్ట్‌మెంట్‌లు నిర్మించి ఉచిత నివాసం అందిస్తుంది. ఇందులోనే దీనామణి ఉప పథకం కింద.. ఎస్సీ కులంలో పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వేరుగా నివసించాలనుకుంటే.. ప్రభుత్వమే ఆ ఇళ్లను నిర్మించి ఇస్తుంది.
👉కేంద్రం 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచిన సంగతి తెలిసిందే. దీనిని 150 రోజులకు పొడిగిస్తామని అన్నాడీఎంకే ప్రకటించింది.
👉అమ్మా.. టూ వీలర్ స్కీమ్ కింద.. మహిళలకు రూ.5 లక్షల లోన్ అందిస్తారు. ఇందులో ప్రభుత్వ సబ‍్సీడీ రూ.25,000 ఉంటుంది.
Chennai, Tamil Nadu: AIADMK General Secretary Edappadi K Palaniswami announces the first phase of the party's election promises
1) Women’s Welfare (Kulavilakku Scheme) Under the Kulavilakku Scheme, a monthly financial assistance of Rs 2,000 will be provided to all ration… pic.twitter.com/gvwHa0126I— ANI (@ANI) January 17, 2026
రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నట్లు పళని స్వామి తెలిపారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. ప్రజలు స్టాలిన్ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారని రాబోయేది ఎన్డీయే సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. 2023 నుంచి అన్నాడీఎంకే బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అన్నాడీఎంకే మేనిఫెస్టో.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా ఉందని, మరీ ముఖ్యమగా అమ్మ ఇల్లమ్ స్కీమ్.. కళైంగర్ హౌజింగ్ స్కీమ్ మాదిరే ఉందని తమిళ మీడియా విశ్లేషిస్తోంది. తమిళనాడులో ఏప్రిల్ లేదంటే మే నెలలో జరిగే అవకాశం ఉంది.


