కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ కౌంటర్.. చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పదేళ్ల కిందట జరిగిన సాగరహారం ఇప్పుడు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ‘పిట్టపోరు’కు వేదికైంది. సాగరహారం ఫొటోలను ట్యాగ్ చేస్తూ తన ట్విట్టర్‌లో కామెంట్ చేసిన మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దీటుగా సమాధానమిచ్చారు. ‘సాగరహారానికి నేటితో పదేళ్లు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం. లక్షల గొంతుకలు ‘జై తెలంగాణ’ అని నినదించిన రోజు. ప్రతిరోజూ పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష రేవంత్, బండి సంజయ్, ప్రవీణ్‌కుమార్, షర్మిల తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ?’ అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో ప్రశ్నించారు.
ఈ ట్వీట్‌కు స్పందించిన రేవంత్‌రెడ్డి ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం సందర్భంగా తాను ఎమ్మెల్సీగా అడ్డుకునే ప్రయత్నం చేశానని, తెలంగాణ ఉద్యమంలో తాను భాగస్వామినేనని గుర్తు చేశారు. ఇందుకోసం నాటి పత్రికల కటింగ్‌లను తన ట్విట్టర్‌లో ట్యాగ్ చేసిన రేవంత్.. ‘చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయి. తెలంగాణ ఉద్యమం సకల జనులది. సాగరహారం ఆ జనుల తరఫున ప్రాతినిధ్యం వహించిన జేఏసీ ఆధ్వర్యంలో జరిగింది. నాడు ఉద్యమంపై, నేడు రాష్ట్రంపై పడి బతకడం మీకు అలవాటైపోయింది’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి రీట్వీట్ చేశారు.
చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయి.
తెలంగాణ ఉద్యమం సకల జనులది.
సాగర్ హారం ఆ జనుల తరపున ప్రాతినిధ్యం వహించిన జేఏసీ ఆధ్వర్యంలో జరిగింది.నాడు ఉద్యమం పై…నేడు రాష్ట్రం పై పడి బతకడం మీకు అలవాటైపోయింది. https://t.co/lXvxL4rqQV pic.twitter.com/IGLtL4z2ha
— Revanth Reddy (@revanth_anumula) September 30, 2022