రెండు దశల్లోనే సెంచరీ కొట్టాం

Uttar Pradesh Assembly Elections 2022 : Samajwadi Party hits century in first two phases - Sakshi

ఫిరోజాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల అసెంబ్లీ ఎన్నికల్లో తాము సెంచరీ కొట్టామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యా బలం(పూర్తి మెజారిటీ) నాలుగో దశ ఎన్నికల కల్లా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫిరోజాబాద్‌ ప్రాంతంలోని నాసిర్‌పూర్‌లో గురువారం ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్‌ మాట్లాడారు.

మొదటి రెండు దశల్లో మొత్తం 113 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఇందులో 100కు పైగా సీట్లు కచ్చితంగా గెలుకుంటామని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులాల గణాంకాలు సేకరిస్తామని హామీ ఇచ్చారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అందజేసిన రాజ్యాం గాన్ని కాపాడేందుకు, దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. చట్టాన్ని అతిక్రమించేవారు, చట్టప్రకారం నడుచుకోనివారు తమ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారు.

తొలిసారి ములాయం ఎన్నికల ప్రచారం
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ ఈ ఎన్నికల్లో తొలిసారిగా గురువారం మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్‌ నియోజకవర్గంలో అఖిలేశ్‌ యాదవ్‌ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అఖిలేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను తమ పార్టీ కచ్చితంగా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అమెరికా సహా ప్రపంచ దేశాల కళ్లు సమాజ్‌వాదీ పార్టీపైనే ఉన్నాయని చెప్పారు. ప్రచార వేదికపై అఖిలేశ్‌ యాదవ్‌ తన తండ్రి పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదాలు పొందారు. కర్హాల్‌లో మూడో దశలో భాగంగా ఈ నెల 20న పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ అఖిలేశ్‌పై బీజేపీ అభ్యర్థిగా ఎస్‌.పి.సింగ్‌ బఘేల్‌ పోటీకి దిగుతున్నారు. ములాయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే అమిత్‌ షా ప్రచారంలో పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top