breaking news
two-phase polls
-
రెండు దశల్లోనే సెంచరీ కొట్టాం
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల అసెంబ్లీ ఎన్నికల్లో తాము సెంచరీ కొట్టామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యా బలం(పూర్తి మెజారిటీ) నాలుగో దశ ఎన్నికల కల్లా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫిరోజాబాద్ ప్రాంతంలోని నాసిర్పూర్లో గురువారం ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్ మాట్లాడారు. మొదటి రెండు దశల్లో మొత్తం 113 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఇందులో 100కు పైగా సీట్లు కచ్చితంగా గెలుకుంటామని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులాల గణాంకాలు సేకరిస్తామని హామీ ఇచ్చారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బాబాసాహెబ్ అంబేడ్కర్ అందజేసిన రాజ్యాం గాన్ని కాపాడేందుకు, దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. చట్టాన్ని అతిక్రమించేవారు, చట్టప్రకారం నడుచుకోనివారు తమ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారు. తొలిసారి ములాయం ఎన్నికల ప్రచారం సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ ఈ ఎన్నికల్లో తొలిసారిగా గురువారం మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేశ్ యాదవ్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అఖిలేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను తమ పార్టీ కచ్చితంగా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అమెరికా సహా ప్రపంచ దేశాల కళ్లు సమాజ్‌వాదీ పార్టీపైనే ఉన్నాయని చెప్పారు. ప్రచార వేదికపై అఖిలేశ్ యాదవ్ తన తండ్రి పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదాలు పొందారు. కర్హాల్‌లో మూడో దశలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. ఇక్కడ అఖిలేశ్‌పై బీజేపీ అభ్యర్థిగా ఎస్.పి.సింగ్ బఘేల్ పోటీకి దిగుతున్నారు. ములాయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. -
బుల్లి రాష్ట్రం - భారీ ఓటింగ్
భారతదేశపు ఈశాన్యం మారుమూలన ఉన్న చిట్టి రాష్ట్రం త్రిపుర. నెలల తరబడి ఈ రాష్ట్రం పేరు కూడా తలుచుకోకుండా గడిపేయొచ్చు. అలాంటి అనామక రాష్ట్రం త్రిపుర. కానీ ఆ రాష్ట్రంలో ఎన్నికలైతే మాత్రం 93 శాతం పోలింగ్ జరుగుతుంది. అంత చైతన్యం ఉంది ఓటర్లలో. అయితే ఒక పెద్ద సమస్య కూడా ఉంది. అదేమిటంటే సరిహద్దుకు అటువైపు నుంచి బంగ్లాదేశీలు చొరబడి ఓటు వేసి వెళ్లిపోతూ ఉంటారట. రాష్ట్ర రాజధాని అగర్తలా పట్టణం మూడు వైపులా బంగ్లాదేశ్ ఉంటుంది. బహుశః ప్రపంచంలో ఇలా ఉన్న ఏకైక రాష్ట్రం త్రిపురయేనేమో! చాలా మంది బంగ్లాదేశీలు ఉదయమే అగర్తలాకి వచ్చి రిక్షాలు తొక్కుకుని, డబ్బులు సంపాదించుకుని, సాయంత్రానికి తిరిగి వెళ్లిపోతూంటారు. అందుకే ఎన్నికలు రాగానే 856 కిమీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దును మూసివేస్తారు. త్రిపురలో ఉన్నవి రెండు లోకసభ సీట్లు. కానీ రెండు విడతలలుగా ఎన్నికలు జరుగుతాయి. అక్కడ తూర్పు త్రిపుర, పశ్చిమ త్రిపుర అని రెండు లోకసభ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రం మూడు వైపులా బంగ్లాదేశ్ ఉంటుంది. అందుకేనేమో వెస్ట్ త్రిపురలో ఏప్రిల్ 7న, తూర్పు త్రిపురలో ఏప్రిల్ 12 న ఎన్నికలు జరుగుతాయి. ఒకప్పుడు గిరిజన తీవ్రవాదం త్రిపుర అటవీప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడు సమస్య కాసింత సద్దు మణిగింది. కానీ సరైన రోడ్లు, కమ్యూనికేషన్లు లేనందున పోలింగ్ నిర్వహించడంలో ఎన్నో సమస్యలుంటాయి. అందుకే రెండు విడతలుగా పోలింగ్ నిర్వహిస్తున్నారు.