బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోండి.. వడ్డీతో సహా చెల్లిస్తాం: రేవంత్‌ వార్నింగ్‌

TPCC Revanth Reddy Warning To BJP Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఈడీ విచారించడంపై టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసు ఎదుట రేవంత్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర‍్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం నేషనల్ హెరాల్డ్ ప్రత్రికను 1937లో నెహ్రూ ప్రారంభించారు. స్వాతంత్య్రం అనంతరం అప్పులతో పత్రిక మూతపడింది. దేశాన్ని విఛ్ఛిన్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని తిప్పికొట్టడానికి నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు కాంగ్రెస్ ఊపిరిపోసి మళ్లీ ప్రారంభించింది.

బీజేపీ దుర్మార్గాలు నేషనల్ హెరాల్డ్ పేపర్ బయటపెడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళినా మనీ లాండరింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చింది. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తుల్లో ఎలాంటి అవినీతి జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయం బీజేపీలో మొదలైంది. అందుకే మూసేసిన కేసులో నోటీసులు ఇచ్చారు. ఇక, సాయంత్రం 5 గంటల వరకే విచారణ ముగించాల్సింది. కానీ, ఈడీ ఆఫీస్‌లో రాహుల్ గాంధీని 12గంటల పాటు కూర్చోబెట్టారు. ఇది ప్రధాని మోదీకి తగునా.. ఓ ఎంపీని, పార్టీ అధ్యక్షుడిని ఇన్ని గంటలు ఎందుకు విచారణ చేయాలి. తల్లి ఆసుపత్రిలో ఉండగా.. కొడుకును ఇలా విచారణ పేరుతో గంటల కొద్దీ కూర్చోపెట్టడం కరెక్టేనా. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇంత బరితెగింపు మంచిది కాదు.

భారత దేశ భవిష్యత్ కోసం తన రక్తాన్ని దారపోయడానికి సిద్దమని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. బీజేపీ నేతలు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ఇంతా మిత్తితో సహా చెల్లిస్తాం. అధికారం శాశ్వతం కాదు. అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ నేతలు చెప్పినట్లు వింటే.. రేపు అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. 300సీట్లతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. తక్షణమే కేసును ఉపసంహరించుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బీజేపీ తీరు మారకుంటే.. ఈ నెల 23న ఢిల్లీలో ఉన్న ఈడీ ఆఫీసును తెలంగాణ బిడ్డలు ముట్టడిస్తారు.

అనంతరం, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌పై రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ‍్యలు చేశారు. సీఎం కేసీఆర్‌తో ఉండవల్లి భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హనీట్రాప్‌లో ఉండవల్లి పడ్డారు. ఉండవల్లి.. సమైక్యాంధ్ర సిద్దాంతం కోసం పోరాడారనే గౌరవం ఉండేది. కేసీఆర్ ఇంట్లోకి పిలిచి ఉండవల్లికి ఏం చెప్పారో?. ఉండవల్లి.. కేసీఆర్ పంచన చేరి భజన చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రజల్లో ఉండవల్లికి ఉన్న గౌరవం పోయింది. బీజేపీపై ​కేసీఆర్‌ పోరాడితే..కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడంలేదు. ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారు. 

రాష్ట్ర విభజనపై ఉండవల్లి రెండు పుస్తకాలు రాశారు. రెండు పుస్తకాల్లో తెలంగాణ ఏర్పాటునే తప్పుబట్టారు. తెలంగాణ కోసం పోరాడిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ను విమర్శించారు. అలాంటి వ్యక్తి ని కేసీఆర్ ఇంటికి పిలిచి కలిసి పనిచేయమంటరా?. ఉండవల్లి అడ్డామీద కూలిగా మారి కేసీఆర్‌తో కలవద్దు. తెలంగాణను వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్ దగ్గరకు తీస్తే.. తెలంగాణ సమాజం ఊరుకోదు’’ అంటూ వ్యాఖ్యాలు చేశారు. 

ఇది కూడా చదవండి: బండి సంజయ్‌కు హయత్‌ నగర్‌ పోలీసుల నోటీసులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top