సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాసేపటి క్రితమే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ..‘కిషన్ రెడ్డి పలుకులు బీఆర్ఎస్ నేతలవి. కేటీఆర్, హరీష్ దారిలో కిషన్ రెడ్డి ఉన్నారు. గనుల శాఖ మంత్రిగా ఉన్నారు కదా విచారణ జరపమనండి.. ఎవరు వద్దన్నారు. టెండర్ల అవకతవకలపై చర్చకు రండి. ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే నిజాలపై చర్చకు రండి. గత బీఆర్ఎస్ హయంలో అవకతవకలపై దర్యాప్తు అవసరం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పారదర్శకత వచ్చింది’ అని వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు కిషన్ రెడ్డి టెండర్ల విషయమై సంచలన ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తరహాలోనే పనిచేస్తోందన్నారు. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. ఎక్కడా లేని సైట్ విజిట్ అనే కొత్త నిబంధన పెట్టారు. రాష్ట్ర పెద్దల ఆదేశంతోనే ఇది జరిగింది. దేశంలో అనేక గనులను కేంద్రం పారదర్శకంగా వేలం నిర్వహిస్తోంది. తెలంగాణ చేతిలో ఒక్క నైనీ కోల్ బ్లాక్ పెడితే అక్రమాలకు తెర లేపారు. ఈ వివాదంలోకి నన్ను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సింగరేణిని బంగారు బాతుగా కాంగ్రెస్ చూస్తోంది. సింగరేణి బొగ్గు క్వాలిటీ పడిపోయింది. దీనిపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సింగరేణిని కలుషితం చేశాయి. సింగరేణి భవిష్యత్ అంధకారంగా మారే పరిస్థితి ఉంది. అనేక జిల్లాలో సింగరేణి భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి నచ్చిన విధంగా వారికి భూములు ఇస్తున్నారని అన్నారు.


