ధరణి రద్దు చేస్తూ తొలి జీఓ | TPCC Chief Revanth Reddy Challenges KCR In Haath Se Haath Jodo Yatra | Sakshi
Sakshi News home page

ధరణి రద్దు చేస్తూ తొలి జీఓ

Feb 17 2023 2:47 AM | Updated on Feb 17 2023 2:47 AM

TPCC Chief Revanth Reddy Challenges KCR In Haath Se Haath Jodo Yatra - Sakshi

ఐనవోలు మండలం పెరుమాండ్ల గూడెంలో మహిళలతో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి    

సాక్షి, వరంగల్‌/వర్ధన్నపేట: 2024 జనవరిలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తూ తొలి జీఓ విడుదల చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అస్తవ్యస్తంగా మారిన భూములను మరింత ఆగమాగం చేస్తున్న ధరణి దరిద్రాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ఈ వర్ధన్నపేట, వరంగల్‌ చుట్టూరా గుంజుకున్న భూములు మీకు రావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌.. చివరికి రేప్‌ కేసుల్లోనూ బీఆర్‌ఎస్‌ సన్నాసులే ఉంటున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఉదయం హనుమకొండ జిల్లా ఐనవోలు నుంచి మొదలైన హాథ్‌ సే హాథ్‌ జోడోయాత్ర సాయంత్రానికి వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటకు చేరుకుంది. రాత్రి అక్కడి అంబేడ్కర్‌ సెంటర్‌లో ప్రజలనుద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘ఐదు వేలు ఇవ్వొచ్చు...పదివేలు ఇవ్వొచ్చు... మీ తాతల కాలం నాటి భూములు మీ చేతిలో ఉండవు. అయినకు ఓటేస్తే ఇందిరమ్మ ఇళ్లు రావు. ఆరోగ్య శ్రీకి ఐదు లక్షలు రావు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. రావు సాబ్‌ పోవాలి’ అని చెప్పారు. 

కేసీఆర్‌కు సూటిగా సవాల్‌ 
‘వర్ధన్నపేట చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసురుతున్నా... డబుల్‌ బెడ్రూమ్‌ ఇచ్చిన ఊళ్లో ఓట్లు నువ్వు వెయ్యించుకో... ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఊళ్లో మేం ఓట్లు వేయించుకుంటాం... ఇంటికి ఉద్యోగమిస్తే వారి ఓట్లు వెయ్యించుకో... నిరుద్యోగుల ఓట్లు మేం వేయించుకుంటాం... లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తే ఆ నియోజకవర్గంలో నీ ఎమ్మెల్యేను గెలిపించుకో... రాని నియోజకవర్గాల్లో మేం గెలిపించుకుంటాం... ఏ ఊళ్లో దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినవో ఆ ఓట్లు నువ్వు వేయించుకో... రానివారి ఓట్లు మేం వేయించుకుంటాం.

దళిత బంధు వచ్చినోళ్లు అందరూ కేసీఆర్‌కు ఓట్లేయండి... రానోళ్లు కాంగ్రెస్‌కు ఓట్లెయ్యండి... రైతు రుణమాఫీ రూ.లక్ష జరిగితే నీకే ఓటేస్తారు’ అని చెప్పారు. ఈ సవాల్‌ను కేసీఆర్‌ స్వీకరించాలన్నారు. అప్పటి కాంగ్రెస్, దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేసి ప్రజల ఆరోగ్యం కోసం తెచ్చిన ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.  

మా నేతల వైపు చూస్తే ఊరుకోం 
తుంగతుర్తి నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేసే ప్రయత్నం చేశారని, తమ నేతలవైపు చూసినా.. కేసులు పెట్టినా ఊరుకోబోమని రేవంత్‌ హెచ్చరించారు. అన్నింటిపై డైరీ రాస్తున్నామని, కాంగ్రెస్‌ కార్యకర్తల మీద దాడులు చేస్తే మిత్తికి మిత్తీ చెల్లించే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుందన్నారు. ‘2003లో మాదిరే 2023లోనూ అవే పరిస్థితులే ఉన్నాయి. 2004లో మాదిరిగానే 2024లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని రేవంత్‌ ధీమావ్యక్తం చేశారు. యాత్రలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ గౌడ్, డాక్టర్‌ రవి మల్లు, కోదండరెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, నమిండ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement