
6 రాష్ట్రాలు, రెండు యూటీల్లోని 49 స్థానాలకు జరగనున్న పోలింగ్
ఏర్పాట్లు పూర్తిచేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ముంబై/లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తదితర కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈరోజే పోలింగ్ చేపడుతున్నారు.
ఏడు దశలను చూస్తే ఈ ఐదో దశలోనే అత్యంత తక్కువ(49) స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 40కిపైగా చోట్ల విజయం సాధించడం విశేషం. దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారైనా మెరుగైన ఓటింగ్ సాధించేలా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో భారీగా పాలుపంచుకోవాలని ముంబై, థానె, లక్నో నగర ఓటర్లకు ఈసీ ఆదివారం విజ్ఞప్తి చేసింది.
బరిలో కీలక నేతలు
కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్(లక్నో), పియూశ్ గోయల్( నార్త్ ముంబై), కౌశల్ కిశోర్(మోహన్‌లాల్‌గంజ్), సాధ్వి నిరంజన్ జ్యోతి(ఫతేపూర్), శంతను ఠాకూర్ (పశ్చిమబెంగాల్‌లోని బంగావ్), ఎల్‌జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ (బిహార్‌లోని హాజీపూర్), శివసేన శ్రీకాంత్ షిండే(మహారాష్ట్రలోని కళ్యాణ్), బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్‌లోని సరణ్), ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్(ముంబై నార్త్ సెంట్రల్)ల భవితవ్యం సోమవారమే ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది.
విపక్షాలు అధికారంలోకి వస్తే అయోధ్య బాలరామాలయం పైకి బుల్డోజర్లను పంపిస్తారని మోదీ తీవ్ర విమర్శలు, ఎన్‌డీఏ 400 చోట్ల గెలిస్తే రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్లు మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందని కాంగ్రెస్ విమర్శలతో ఐదో దశ ప్రచారపర్వంలో కాస్తంత వేడి పుట్టించింది. ఒడిశాలో ఐదు లోక్‌సభ స్థానాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ కింద 35 ఎమ్మెల్యే స్థానాల్లోనూ సోమవారం పోలింగ్ జరగనుంది.
బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పోటీచేస్తున్న హింజీలీ అసెంబ్లీ స్థానంలో ఈరోజే పోలింగ్ ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగోదశ ముగిశాక 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో ఇప్పటిదాకా 379 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఆరో దశ పోలింగ్ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనుంది.